సిటీబ్యూరో: న్యూ ఇయర్ వేడుకలు అనగానే గుర్తుకొచ్చేది పబ్బులు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించే గ్రౌండ్స్, హోటల్స్, ఇతర ప్రాంతాలు. అర్ధరాత్రి వరకు మద్యం మత్తులో చాలా మంది యువత చిందులేస్తుంటారు. దీనినే ఆసరాగా చేసుకుంటూ డ్రగ్స్ ముఠాలు ఆయా పబ్‌లు, హోటళ్లలో డ్రగ్స్‌ను విక్రయిస్తుంటారు. ప్రతి ఏటా న్యూ ఇయర్ వేడుకల్లో ఈ డ్రగ్స్ ముఠాలు పట్టుబడుతూ ఉంటాయి. అయినా కూడా తమ రూట్‌ను మారుస్తూ ఈ వేడుకలను తమ వ్యాపారానికి అనుకూలమైన సమయంగా భావిస్తుంటాయి.
ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా న్యూ ఇయర్ వేడుకలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించే వారు తప్పనిసరిగా పోలీసు అనుమతి తీసుకోవాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. డ్రగ్స్ విక్రయాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేశారు. పాత నేరస్తులపై నిఘా పెట్టారు.