Hyderabad | శేరిలింగంపల్లి, మార్చి 15 : మార్పింగ్ వీడియోతో 10వ తరగతి చదువుతున్నబాలికను అదే తరగతికి చెందిన బాలురు బ్లాక్ మెయిల్ చేసి వేధించారు. తోటి విద్యార్థుల వేధింపులు భరించలేక జరిగిన విషయాన్ని బాధితురాలు తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో బాధితురాలితో గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయించగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని ముగ్గురు బాలురను అరెస్టు చేశారు.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం… గచ్చిబౌలిలోని ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలికకు అదే తరగతిలో చదువుతున్న ఓ బాలుడు మంచి స్నేహితుడయ్యాడు. ఈ క్రమంలో మార్ఫింగ్ చేసిన వీడియోతో సదరు స్నేహితుడు యువతిని బ్లాక్ మెయిల్ చేయడంతో ఇద్దరు ప్రైవేటుగా కలుసుకున్నారు. వీరు ప్రైవేటుగా కలుసుకున్న సమయంలో అదే తరగతికి చెందిన మరో బాలుడు వీడియో తీశాడు. సదరు వీడియోను మరో స్నేహితుడికి పంపించాడు. ఈ వీడియోతో బాలికను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో వారి వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు మైనర్లను అరెస్టు చేశారు.