సిటీబ్యూరో, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ ) : ఏదైనా ప్రాజెక్టు పనులు చేపట్టే ముందు భూ సేకరణపై విధి విధానాలు రూపొందించి కనీసం టెండర్ల దశలోనే 30 శాతానికి పైగా భూ సేకరణ చేసి ఉండాలి. అప్పుడే పనులను ప్రారంభించి నిర్ణీత సమయంలోపు ప్రాజెక్టును పూర్తి చేయాలి. కానీ ఘనత వహించిన జీహెచ్ఎంసీ ప్రాజెక్టు విభాగం భూ సేకరణపై స్పష్టత రాకముందే టెండర్లు పిలవడం…నెలల తరబడి పనులు చేపట్టక ప్రాజెక్టు ఉనికి ప్రశ్నార్థకంగా మార్చుతున్న పరిస్థితి.
హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్ సిటీ) ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన పనుల్లో భాగంగా రూ.1090 కోట్లతో కేబీఆర్ పార్కు చుట్టూ నిర్మించనున్న ఆరు స్టీల్ ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్ పనులకు గతేడాది డిసెంబర్లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించగా.. 20 నెలలు కావొస్తున్నా.. పనులు ఇప్పటి వరకు ప్రారంభించలేదు.
భూ సేకరణపై అడుగడుగునా అవాంతరాలు, న్యాయపరమైన చిక్కు ముడులు వెంటాడుతున్నాయి. సరైన ప్రణాళికలు లేకపోవడం, అధికారుల పనితీరులో అత్యుత్సాహం వెరసి కేబీఆర్ పార్కు ప్రాజెక్టు పనులు పట్టాలెక్కలేదు..ఎప్పుడు ప్రారంభిస్తారో? పూర్తికి ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారో? అనేది అధికారులు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ ప్రాజెక్టు అనుభవం పరిగణనలోకి తీసుకోకుండా మరో హెచ్ సిటీ ప్రాజెక్టుకు ఆగమేఘాలపై టెండర్లు పిలిచారు.
జూబ్లీహిల్స్ సర్కిల్-18లోని బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్ వరకు 100, 120 అడుగుల ఆర్డీపీ వరకు వెడల్పు చేయబడిన రోడ్డు భాగంలో బీటీ రోడ్డు వేసేందుకు రూ. 150కోట్ల పనులకు టెండర్లను ఆహ్వానించారు. 2వ తేదీ నుంచి 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు దరఖాస్తుకు తుది గడువు విధించారు. అయితే భూసేకరణపై స్పష్టత లేకుండానే ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలవడం, అందులో భూ సేకరణ విభాగం అధికారుల నోటీసులో లేకుండా టెండర్లు పిలిచిన తీరు చర్చనీయాంశంగా మారింది.
భూ సేకరణకు అడుగడుగునా అడ్డంకులు
బంజారాహిల్స్ విరించి దవాఖాన నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్ వరకు 200 ఫీట్ల మేర రహదారిని విస్తరించాలని నిర్ణయించారు. నిర్మాణానికి గానూ రూ. 150కోట్ల అంచనాతో టెండర్లు పిలిచారు. అయితే క్షేత్రస్థాయిలో రహదారి విస్తరణకు ఆస్తుల స్వాధీనంపై స్పష్టత లేదు. 16 చోట్ల ఆస్తులను భూ సేకరణ విభాగం అధికారులు యాజమానులకు సీ నోటీసులు జారీ చేశారు. మరో 16 చోట్ల ఆస్తుల స్వాధీనానికి యాజమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మరికొన్ని చోట్ల ఆస్తుల స్వాధీనంలో గుర్తింపు ప్రక్రియ జరుగుతున్నది. ఈ ప్రాజెక్టుకు ముందు నుంచి సరైన ప్రణాళిక లోపించింది. భూ సేకరణపై విధి విధానాలు రూపొందించకపోవడం, ఈ ప్రాజెక్టు కింద సినీ, రాజకీయ ప్రముఖులు ఉండడం భూ సేకరణపై ఎలాంటి స్పష్టత లేకుండా ముందుకు సాగారు. ఫలితంగా క్షేత్రస్థాయిలోకి దిగిన అధికారులకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇప్పట్లో భూ సేకరణ పూర్తి చేయడం కష్ట సాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు జఠిలవుతుమన్నది. టెండర్లపై పెట్టిన శ్రద్ద భూ సేకరణ అంశంలో భూ సేకరణ విభాగం, టౌన్‌ప్లానింగ్ అధికారులను సమన్వయపర్చడంలో ప్రాజెక్టు విభాగం విఫలం చెందడం గమనార్హం.