సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : దుర్గామాత విగ్రహాల నిమజ్జన టెండర్ నిబంధనలను ఎట్టకేలకు మార్చారు. చిన్న కాంట్రాక్టర్ల ఉపాధికి గండి కొడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద కాంట్రాక్టర్లకు అనుకూలంగా క్రేన్లు సొంతంగా ఉన్న వారికే దుర్గామాత విగ్రహాల తొలగింపు ప్రక్రియలో పాల్గొనాలంటూ ఖైరతాబాద్ సర్కిల్ -17 ఇంజినీర్లు టెండర్లను పిలిచారు.
అధికారుల అక్రమాలను ఎత్తిచూపుతూ ‘దుర్గమ్మా అక్రమాలు చూడమ్మా’ అనే శీర్షికతో గురువారం ‘నమస్తే’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన ఇంజినీరింగ్ సీఈ (మెయింటనెన్స్) ఖైరతాబాద్ జోనల్ ఇంజినీర్ల నుంచి టెండర్ ప్రాసెస్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. టెండర్ నిబంధనలు వెంటనే మార్చి పాత విధానంలోనే టెండర్లు పిలవాలని సూచించారు. ఈ మేరకు పీపుల్‌ప్లాజా, నెక్లెస్‌రోడ్ బేబీ పాండ్స్ వద్ద దుర్గామాత విగ్రహాలు నిమజ్జనం టెండర్లను పాత విధానంలోనే తిరిగి రీ టెండర్ పిలిచారు. ఈ నెల 29న తుది గడువు విధించారు.