సిటీబ్యూరో, జూలై 16 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలోని చాంద్రాయణగుట్ట సర్కిల్లో పలు అభివృద్ధి పనుల టెండర్లను అర్థాంతరంగా రద్దుచేయడంపై జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల అసోసియేషన్ అడహాక్ కమిటీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్ ప్రైజ్ బిడ్లు ఓపెన్ చేసిన తర్వాత ఎల్-1 ప్రక్రియ ముగిశాక నిబంధనలకు విరుద్ధంగా టెండర్లను రద్దుచేసి రీకాల్ చేయడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా రాజేంద్రనగర్ ఎస్ఈ నరేందర్ తీరుకు వ్యతిరేకంగా కాంట్రాక్టర్లు గురువారం చార్మినార్ జోనల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. టెండర్ డాక్యుమెంట్లలో ఎక్కడా కూడా ఫలానా శాతం కంటే ఎక్కువ బిడ్ దాటితే రద్దుచేస్తామనే నిబంధనలు లేవని, అయినప్పటికీ ఏ ప్రాతిపదికన రీకాల్ చేశారని అసోసియేషన్ అడహాక్ కమిటీ వైస్ చైర్మన్ గుంటి సాయి కిరణ్ ప్రశ్నించారు. గతంలో చిన్న తరహా పనులకు 25 నుంచి 40 శాతం వరకు అనుమతించిన అధికారులు..ఇప్పుడు సీసీ రోడ్ల వంటి మేజర్ పనుల టెండర్లను ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. అనంతరం ఎస్ఈ నరేందర్ గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు.
పారదర్శకంగా టెండర్లు
జీవో 66 ప్రకారమే టెండర్లను ఆహ్వానిస్తాం. టెండర్లలో సిమిలర్ నేచర్ ఆఫ్ వర్క్ ఎక్స్ప్రీరియన్స్ నిబంధన ఇకపై ఉండకుండా చూసు కుంటాం. సర్కిల్ పరిధిలో టెండర్ల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండేలా చూస్తాం. నిబంధనలు పాటిస్తాం.
– నరేందర్ గౌడ్, ఎస్ఈ