మేడ్చల్, నవంబర్ 5(నమస్తే తెలంగాణ): దేవాలయాల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేవాలయాల పునరుద్ధరణ పనులకు గాను రూ.5 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలలోని 60 దేవాలయాలకు పునరుద్ధరణ పనులను ప్రారంభించనున్నారు. దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు దేవాదాయ -ధర్మాదాయ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఆధ్మాత్మిక శోభను పెంపొందించేందుకు దేవాలయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. పురాతన దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు మంజూరు చేసిన నిధులతో పునరుద్ధరణ పనులను చేపట్టానున్నారు. మరమ్మతులలో భాగంగా గోపురాలు, మండపాల నిర్మాణాలు, కలర్స్(రంగులు) వేయడం, అవసరం ఉన్న చోట కల్యాణ మండపాలు, వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పించుటకు మంజూరు చేసిన నిధులను వెచ్చించనున్నారు. దేవాదాయ – ధర్మాదాయ శాఖ పరిధిలోకి వచ్చే దేవాలయాల పునరుద్ధరణకు ప్రతిపాదనలు సమర్పించిన వెంటనే నిధుల మంజూరికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుంది. స్వరాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ పండుగలకు అధిక ప్రాధాన్యత ఇస్తూనే చరిత్ర కల్గిన దేవాలయాల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుంది.
దేవాలయాలు నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లయితే నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో దేవాలయాల నిర్మాణాలకు స్థలం లేదా నిధులు సమీకరించుకున్న ప్రజలు దేవాదాయ శాఖను సంప్రందించినట్లయితే సమీకరించుకున్న నిధుల ప్రకారం, నిర్మాణానికి అవసరమయ్యే ప్రతిపాదనలను అధికారులతో సిద్ధం చేయించి 70 శాతం నిధులను ప్రభుత్వం అందించనుందని అధికారులు వెల్లడించారు. మరో 15 దేవాలయాల అభివృద్ధికి ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించామని వాటికి త్వరలోనే నిధులు మంజూరు కానున్నట్లు తెలిపారు. అలాగే, దేవాదాయ – ధర్మాదాయ భూములు కబ్జాలకు గురి కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఉన్న దేవాదాయ భూములున్న చోట అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక రూపొందించారు.