ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న చలి గాలులు గ్రేటర్ వాసులను గజగజ వణికిస్తున్నాయి.
మూడేండ్ల కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు
11 డిగ్రీలు నమోదు..ఎల్లో అలర్ట్
సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న చలి గాలులు గ్రేటర్ వాసులను గజగజ వణికిస్తున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 5డిగ్రీలు కిందకు పడిపోవడంతో చలి పులి గ్రేటర్‌పై పంజా విసురుతోంది. 2019 తరువాత ఈ స్థాయిలో ఉష్ణోగ్రలు పడిపోవడం గడిచిన మూడేండ్లలో ఇదే రికార్డు అంటున్నారు వాతావరణ కేంద్రం అధికారులు. అయితే నగరంలో 9డిగ్రీల వరకు పడిపోయిన సందర్భాలు చాలా ఉన్నట్లు స్పష్టం చేశారు.
2018లో అత్యల్పంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నగరంలో 10.8డిగ్రీలు, 2019లో 11.2డిగ్రీల చొప్పున నమోదైనట్లు అధికారులు తెలిపారు. తాజాగా ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 5డిగ్రీలు కిందకు పడిపోయి 11డిగ్రీల సెల్సియస్, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.7డిగ్రీలు, గాలిలో తేమ 49శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా గ్రేటర్ శివారు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10-11డిగ్రీల మధ్య నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులు చలిగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు గ్రేటర్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.