జవహర్‌నగర్/బోడుప్పల్, సెప్టెంబర్ 3: ప్రగతి పనులతో తెలంగాణ దేశంలోనే చరిత్ర సృష్టించిందని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. జవహర్‌నగర్ కార్పొరేషన్లో రూ. 1.35 కోట్లతో చేపట్టనున్న ఎఫ్ఎస్టీపీ, ఏబీసీ సెంటర్ల నిర్మాణ పనులకు ఆదివారం ఆయన మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కమిషనర్ రామలింగంతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక విజన్‌తోనే తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ప్రతిపక్షాలు ఏమీ చేయలేక తికమక పడుతున్నాయన్నారు.
జవహర్‌నగర్‌లో ప్రగతి పనులు పరుగులు పెడుతున్నాయని, త్వరలోనే మాడల్ సిటీగా మారుతుందని, ఇందుకోసం తన వంతుగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంతో రైతులు, కార్మికులు, కులవృత్తులు, సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఏకే మురుగేశ్, జిట్టా శ్రీవాణిశ్రీనివాస్రెడ్డి, లలితాయాదవ్, పల్లపు రవి, లావణ్యసతీష్గౌడ్, ఆశాకుమారి, రాజ్‌కుమార్, శివాజీ,రోజాశ్రీనివాస్, నిహారిక, శాంతికోటేశ్గౌడ్, రాంచందర్, బీఆర్ఎస్ డివి జన్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, యువజన విభాగం అధ్యక్షుడు భార్గవ్‌రామ్, ఉద్యమకారులు పిన్నొజు సుధాకర్‌చారి, సింగన్న బాల్‌రాజ్, ప్రకాశ్, ఉపేందర్, రాజయ్య, మహేశ్, ఎల్లస్వామి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వక్ఫ్‌బోర్డు సమస్యకు త్వరలోనే పరిష్కారం : మంత్రి మల్లారెడ్డి
బోడుప్పల్ నగరపాలన సంస్థ వక్ఫ్‌బోర్డు సమస్యను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని, త్వరలో సమస్యకు పరిష్కారం కానున్నట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. బోడుప్పల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో వక్ఫ్‌బోర్డు బాధితులు ఆదివారం మంత్రి మల్లారెడ్డిని తన నివాసంలో కలిసి సమస్యను వివరించారు. రిజిస్ట్రేషన్లు నిలుపుదలతో 7 వేల కుంటుంబాలు రోడ్డున పడ్డాయని, ప్రభుత్వం మానవతా దృక్పథంలో సమస్యను పరిష్కరించాలని కోరారు. పిల్లల పెండ్లిళ్లకు ప్రస్తుతం ఇండ్లు అమ్ము కోవడానికి వీలు లేకుండా ఉన్నదని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి మల్లారెడ్డి పురపాలక,ఐటీశాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో వక్ఫ్‌బోర్డు జేఏసీ కన్వీనర్ శ్రీధర్‌రెడ్డి, రాజు, ప్రమోద్లింకన్, రాజిరెడ్డి, ప్రహ్లాద్‌రెడ్డి మహిళలు పాల్గొన్నారు.