ఘట్కేసర్ రూరల్, నవంబర్ 21: సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తున్నదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం ఘట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామ పంచాయతీ జాతీయ రహదారి నారపల్లి నుంచి ఎదులాబాద్ వరకు రూ.15 కోట్లతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ, నిర్మాణ పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తాగు, సాగునీరు, నిరంతర ఉచిత విద్యుత్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని వివరించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, డీఈ రవీందర్ గౌడ్, ఏఈ శ్రీనివాస్ రెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్, చౌదరిగూడ సర్పంచ్ బైరు రమాదేవి, మాజీ సర్పంచ్ రాములు గౌడ్, ఎదులాబాద్ సర్పంచ్ సురేష్, ఎంపీటీసీలు భాస్కర్ రెడ్డి, వినోద, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, మాజీ అధ్యక్షుడు కందుల కుమార్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి పాల్గొన్నారు.
మాట ఇచ్చి.. అభివృద్ధిని ప్రారంభించి..
జవహర్‌నగర్, నవంబర్ 21: జవహర్‌నగర్‌లో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. సోమవారం కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ నుంచి శాంతినగర్ వరకు రూ.2 కోట్ల సీఎస్ఆర్ నిధులతో సీసీ రోడ్డు పనులకు డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. అయితే ఆదివారం జవహర్‌నగర్‌లో పర్యటించిన మంత్రి మల్లారెడ్డి అక్కడ సమస్యలను పరిష్కరిస్తానని ఇచ్చిన మాట మేరకు సోమవారం అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.