సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : కారణాలు ఏవైనా కావొచ్చు.. ఆత్మహత్య అనేది సహేతుకం కాదని తెలంగాణ సైకాలజిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు మోత్కూరి రామచంద్రం అన్నారు. బుధవారం ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం కావడంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో అవగాహన కల్పించినట్టే.. ఈ ఏడాది ‘ఛేంజింగ్ ద నెరేటివ్ ఆన్ సుసైడ్’ థీమ్‌తో అవగాహన కల్పిస్తున్నట్టు వివరించారు.
ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ స్టడీస్ ప్రకారం ఈ ఏడాదిలో మహిళల కంటే పురుషులు 2.5 శాతం అధికంగా ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ప్రపంచ వ్యా ప్తంగా 7 లక్షల ఆత్మహత్యలు జరుగుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయన్నారు. అత్యధికంగా దేశంలో ఆత్మహత్యలు ఈ ఏడాది నమోదైనట్టు చెప్పారు. ప్రతి గంటకు 18 ఆత్మహత్యలు జరుగుతున్న ట్టు వివరించారు. ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు ఒత్తిడి, మానసిక వేధింపులు, ఆరోగ్య సమస్యలు, జన్యు సంబంధ కారకాలు, ఆర్థిక కారణాలుగా ఉన్నాయని పేర్కొన్నారు.ఒత్తిడితో ఉన్నవారికి కౌన్సెలింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. కాగా, స్కూళ్లు, కాలేజీల్లో నేడు ఆత్మహత్య నివారణపై అవగాహన కల్పించనున్నట్టు వెల్లడించారు.