సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ప్రాథమిక వైద్యం మరింత బలోపేతం కానుంది. నగరంలో పెరుగుతున్న జనాభా విస్తరణను దృష్టిలో పెట్టుకొని ప్రజా వైద్యాన్ని మరింతగా విస్తరించాల్సిన ఆవశక్యతపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం డీఎంహెచ్వోల సంఖ్యను ఆరుకు పెంచుతూ గత నెలలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన 5 డీఎంంహెచ్వో పోస్టులను మంజూరు చేస్తూ గురువారం జీవోను విడుదల చేసింది.
ప్రస్తుతం కోటి జనాభా ఉన్న మహానగరం మొత్తానికి ఒకేఒక్క డీఎంహెచ్వో ఉండగా ఇక నుంచి ఈ సంఖ్య కొత్తగా ఆరుకు పెరిగింది. కొత్తగా చార్మినార్, ఖైరతాబాద్, శేరీలింగంపల్లి, ఎల్బీనగర్, కూకట్పల్లి, సికింద్రాబాద్ జోన్లలో మూడు నెలల్లో కొత్త వైద్యాధికారులు కొలువుదీరనున్నారు.