హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక శాఖ దీపావళి కోసం సర్వం సిద్ధమైంది. దీపావళి సందర్భంగా జరిగే అగ్ని ప్రమాదాల నియంత్రణ, నివారణ కోసం అన్ని విధాలా సన్నద్ధమైంది. అత్యవసర ఫొన్ కాల్స్‌కు స్పందించి వెంటనే రంగంలోకి దిగేందుకు రాష్ట్రవ్యాప్తంగా తమ సిబ్బంది మొత్తాన్ని అప్రమత్తం చేసింది.
దీపావళి నాడు క్రాకర్లు కాల్చడం, దీపాలు, కొవ్వొత్తులు వెలిగించడం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ల కారణంగా, నివాస ప్రాంతాలు, వాణిజ్య సంస్థలు, కంపెనీల నిర్లక్ష్యం వల్ల జరిగే అగ్ని ప్రమాదాలకు సంబంధించి వివిధ ప్రాంతాల నుండి ఫైర్ ఆఫీసులకు ఫోన్ కాల్స్ వస్తాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అన్ని అగ్నిమాపక కేంద్రాలకు పంపినట్లు చెప్పారు.
ప్రధానంగా మార్కెట్లు, బాణసంచా దుకాణాల క్లస్టర్లను హైరిస్క్ జోన్లుగా గుర్తించినట్లు ప్రాంతీయ అగ్నిమాపక అధికారి వి పాపయ్య తెలిపారు. సికింద్రాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం, నుమాయిష్ గ్రౌండ్స్, పరేడ్ గ్రౌండ్స్ వంటి ప్రదేశాలు ఈ జాబితాలో ఉన్నాయని చెప్పారు. హైరిస్క్ జోన్లలో ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణమే కార్యాచరణకు దిగేందుకు అగ్నిమాపక యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచామన్నారు.
గతంలో అగ్ని ప్రమాదాలు జరిగిన కొన్ని కాలనీలు, ఇండస్ట్రియల్ క్లస్టర్లు కూడా గుర్తించినట్లు పాపయ్య చెప్పారు. వెంటనే స్పందించేందుకు ఆయా చోట్ల చిన్న వాహనాలు, మోటార్ సైకిళ్లను మోహరించినట్లు వెల్లడించారు. అధికారుల సెలవులను రద్దు చేయడంతోపాటు అదనపు సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచామన్నారు.
కాగా, దీపావళి మూడు రోజులలో సాధారణంగా సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి దాటాక అగ్ని ప్రమాదాల ఫిర్యాదులు ఎక్కువగా వస్తాయని జిల్లా అగ్నిమాపక అధికారి (హైదరాబాద్) ఎం శ్రీనివాస రెడ్డి తెలిపారు. సీరియల్ బల్బులు, భారీ ఫ్యాన్సీ లైటింగ్ లేదా లైట్ పటాకులు ఉపయోగించి దుకాణాలను అలంకరించడం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు.
మండే పదార్థాలను పెద్ద పరిమాణంలో ఎక్కడ నిల్వ చేస్తారో అక్కడ అగ్ని ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉంటుదని శ్రీనివాస రెడ్డి చెప్పారు. అగ్నిమాపక భద్రతపై యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. పెద్ద ప్రమాదాల నియంత్రణకు అగ్నిమాపక అధికారులతో TSPDCL, HMWS&SB అధికారులు సమావేశమై సంబంధిత కార్యాచరణ ప్రణాళికను రూపొందించారని వెల్లడించారు.