సిటీబ్యూరో: బీఆర్ఎస్ హయాంలో లక్షల మంది పేద రోగులకు ఆపన్నహస్తంగా నిలిచిన తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లు.. నేడు వెలవెలబోతున్నాయి. పైసా ఖర్చు లేకుండా 57 రకాల రక్త పరీక్షలు, ఎక్సరే, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించి..సకాలంలో సరైన చికిత్స అందించేందుకు దోహదపడిన ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లు నేడు కాంగ్రెస్ పాలనలో సరైన నిర్వహణ లేక ఆగమాగమవుతున్నాయి.
నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2018, జనవరిలో టీ-డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభించింది. 57 రకాల వైద్యపరీక్షలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఖరీదైన వైద్య పరీక్షలు పూర్తి ఉచితంగా నిర్వహించారు. వ్యాధులను సకాలంలో గుర్తించగలిగారు. ఫలితంగా అటు రోగుల ఆరోగ్యం, ఇటు ఆర్థిక భారాన్ని సైతం తగ్గించిగలిగారు.
స్కానింగ్లు బంద్..
మినీ డయాగ్నోస్టిక్ సెంటర్లలోని స్కానింగ్ విభాగాలలో రేడియాలజిస్టు వైద్యులు లేక రోగులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. సుమారు 15 సెంటర్లలో రేడియాలజిస్టులు లేక స్కానింగ్ విభాగాలు అలంకారప్రాయంగా మారాయి. దీంతో రోగులకు ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లే శరణ్యంగా మారుతున్నాయి. ముఖ్యంగా గర్భిణులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
సకాలంలో అందని రిపోర్టులు
గత కొన్ని రోజులుగా సాంకేతిక లోపం సాకుతో రెండు మూడు రోజుల వరకు రిపోర్టులు రావడం లేదని రోగులు వాపోతున్నారు. చాలా సందర్భాల్లో అసలు రిపోర్టులే రాకపోవడంతో మళ్లీ వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఉందని రోగులు వాపోతున్నారు.