గద్దర్ సినిమా అవార్డులను తెలంగాణ సినిమాలకే ఇవ్వాలి
థియేటర్ల మాఫియాను ప్రభుత్వం అరికట్టాలి
తెలంగాణ సినిమా వేదిక డిమాండ్
TCV | ఖైరతాబాద్, మే 15 : ప్రత్యేక రాష్ట్రంలో నేటికీ తెలంగాణ సినిమాపై ఆంధ్రా ఆధిపత్యం కొనసాగుతుందని, దీనిని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని తెలంగాణ సినిమా వేదిక స్పష్టం చేసింది. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేదిక రాష్ట్ర కన్వీనర్ లారా, కో కన్వీనర్ మోహన్ బైరాగి, గౌరవ సలహాదారులు ప్రఫుల్ రాంరెడ్డిలు తెలంగాణ సినిమాకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. రాష్ట్రంలో తెలంగాణ ఫిలిం చాంబర్ పేరుకే ఉందని, చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఆంధ్ర సినీ పెద్దల చేతుల్లోనే థియేటర్లు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో థియేటర్ మాఫియా సాగుతున్నదని ఆరోపించారు.
1993 అక్టోబర్ 4న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఏర్పడిందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా ఇంకా ఉమ్మడిగా ఎందుకు కొనసాగుతున్నది ప్రశ్నించారు. ఫిలిం చాంబర్లు ఆంధ్రా, తెలంగాణ వేర్వేరుగా ఉండాలని, కానీ ప్రస్తుత చాంబర్లో నేటికీ ఆంధ్రా పెత్తనం సాగుతున్నదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గద్దర్ అవార్డును తెలంగాణ సినిమాలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఆంధ్రా, తెలంగాణ సినిమా రంగాల విభజన జరగాలని, తెలంగాణ ఫిలిం చాంబర్లో వెంటనే మార్పులు చేయాలని కోరారు. ఇక్కడి సినిమా కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, సీనియర్ కళాకారులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ సినిమా రంగంలోని 24 క్రాఫ్టుల్లో ఈ ప్రాంతం వారే అధికంగా ఉండేలా చూడాలన్నారు. చిన్న సినిమాలకు నెలకు 14 రోజుల్లో అన్ని థియేటర్లలో అవకాశం ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఫిలిం చాంబర్‌కు నూతన భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ఆధారంగా నిర్మించే చిత్రాలకు 30 శాతం సబ్సిడీ ఇవ్వాలని, చిన్న సినిమాల నిర్మాణంలో 20 శాతం రాయితీ కల్పించాలన్నారు. తెలంగాణ సినిమా విభజన జరిగేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.