మేడ్చల్, అక్టోబర్24(నమస్తే తెలంగాణ): సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించాం.. ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.. అని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గౌతమ్ హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్లోని జీ-36లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్‌ను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి మీడియా పూర్తి సహకారం అందించాలన్నారు. శాసనసభ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకు అందించాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. వార్తా పత్రికలు, ఈ పేపర్లు, డిజిటల్ పేపర్లు, టెలివిజన్ చానళ్లు, స్థానికంగా కేబుల్ నెట్ వర్కులు, సోషల్ మీడియా, సంక్షిప్త సందేశాలు, ఇతర ఆడియో, వీడియో విజువల్ మీడియాలతో సహా ప్రకటనలను ఎంసీఎంసీ ద్వారా ముందస్తు అనుమతి పొందిన తర్వాతే విడుదల చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. శాటిలైట్ చానళ్లలో వచ్చే వార్తలను పూర్తిస్థాయిలో రికార్డు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎన్నికలకు సంబంధించి విధి విధానాలపై సలహాలు, సూచనలు చేశారు. కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ ఉన్నారు.
ఎన్నికల కంట్రోల్ రూమ్‌కు వచ్చే ఫిర్యాదులు, సలహాలపై దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. కంట్రోల్ రూమ్‌ను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఎన్నికల కంట్రోల్ రూమ్ 18004253050కు వచ్చే ఫిర్యాదులు, చేపడుతున్న చర్యలను స్వయంగా కలెక్టర్ పరిశీలించారు. అలాగే సీ-విజిల్ యాప్ 1950 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వస్తున్న ఫిర్యాదులు, పరిష్కారం.. వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీ-విజిల్ యాప్ ద్వారా 50 ఫిర్యాదులు రాగా.. వాటిని పరిష్కరించినట్లు వెల్లడించారు.
జిల్లా కలెక్టరేట్లోని అన్ని కార్యాలయాల్లో అధికారులు, సిబ్బందికి అవసరమైన వసతులు కల్పించాలని కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. కలెక్టరేట్లోని అన్ని కార్యాలయాలను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట డీఆర్వో హరిప్రియ, కలెక్టరేట్ ఏవో రామ్మోహన్ ఉన్నారు.