Revanth Reddy | కోట్లాది మంది తెలంగాణ ప్రజల గుండె చప్పుడు కేసీఆర్. ఎన్నో ఏండ్ల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారం చేసిన మహోన్నత ఉద్యమ నాయకుడు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్ర నాయకులు మోకాలడ్డుతున్న వేళ ఆమరణ నిరాహార దీక్షకు దిగి ప్రాణాలకు తెగించిన గొప్ప పోరాట యోధుడు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అని నినదించిన తెలంగాణ కెరటం ఆయన. గల్లీ నుంచి ఢిల్లీ మీదుగా ప్రపంచ దేశాల ప్రజలకు అభిమాన పోరాట యోధుడు కేసీఆర్. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ. సంక్షేమ పథకాలతో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్ చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజానీకం, నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
రవీంద్రభారతిలో బుధవారం జూనియర్ లెక్చరర్లకు నియామక ప్రతాలు అందించే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను ఉద్దేశించి.. మాట్లాడుతూ.. ‘మీకు మీరే స్టేచర్ ఉందని ఫీలైతే.. స్ట్రేచర్ మీదకు పంపించారు.. ఇట్లనే చేస్తే ఆ తర్వాత మార్చురీకి పోతారు.’ అంటూ అవహేళనగా దూషించారు. రేవంత్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డిది దుష్ట గుణం.. చావే కోరుకుంటారని.. కేసీఆర్‌ది దైవ గుణం.. అందరూ బాగుండాలని ఆశిస్తారని రఘువీర్ రాథోడ్ అనే వ్యక్తి ఎక్స్ వేదికగా ఖండించారు. మరో నెటిజన్ తిరుపతి మరుపాక ’దమ్ముంటే కేసీఆర్‌ను టచ్ చేసి చూడు’ అంటూ సవాల్ విసిరారు. నీచులు ఎప్పుడూ నీచంగానే మాట్లాడుతారని ఫైర్ అయ్యారు. శివ ప్రసాద్ నారాయణ అనే నెటిజన్ స్పందిస్తూ ‘’ అయ్యా గుంపు మేస్త్రీ నీకు స్ట్రేచర్ పదానికి కనీసం స్పెల్లింగ్ తెలుసా” అంటూ ఎద్దేవా చేశారు.
మరో నెటిజన్ స్పందిస్తూ కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టి-మన చిట్టి నాయుడి కోసమే రాసినట్టు ఉంది ఈ పద్యమంటూ రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో నెటిజన్ ప్రేమ్ రెడ్డి స్పందిస్తూ.. అయ్యా రేవంత్ నీ పేరు చివరన రెడ్డి అనే పదం తీసెయ్..నువ్వు మాట్లాడే మాటలకు రెడ్డి పరువు పోతున్నది అంటూ ఎద్దేవా చేశారు. మరో నెటిజన్ ప్రభాకర్ స్పందిస్తూ నువ్వు ఎర్రగడ్డకు పోవడం ఖాయమన్నారు. సీఎం రేవంత్‌ను ఉద్దేశించి సంతోష్ అనే నెటిజన్ స్పందిస్తూ.. అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్.. రేవంత్ ఓవరాక్షన్‌కు బ్రేకులు వేయాల్సి ఉండే ..అని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరో నెటిజన్ మధురెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఇప్పటికీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే 5 సీట్లు కూడా రావని.. ప్రచారం చేయకపోయినా కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. మరో వ్యక్తి సంతోష్ స్పందిస్తూ.. ఓటుకు నోటు కేసు ప్రస్తావిస్తూ.. ఇంతకీ 50 లక్షలు బ్యాగ్ ఎక్కడివి అంటూ విమర్శించారు.
విజ్ఞతను కోల్పోయి మాట్లాడకు..
రాష్ర్టాన్ని సాధించిన వ్యక్తిపై సీఎం రేవంత్ రెడ్డి తన స్థాయిని మరిచి మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నా. రేవంత్‌కు ఇది మంచిది కాదు.. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. సీఎం కుర్చీని కూడా ఆయన దిగజార్చి మాట్లాడుతున్నారు. దినదినం విజ్ఞతను కోల్పోతున్నారు.
సీఎం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో వణుకుపుట్టింది. కేసీఆర్‌కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక సీఎం రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. – ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
దృష్టి మరల్చేందుకే..
ఆరు గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తన చేతకాని తనాన్ని ప్రజలకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలుకాకపోవడంతో క్షేత్రస్థాయిలో ప్రజలు తిడుతున్నారు. ప్రతిపక్ష నేతలు ప్రజల పక్షాన పోరాడుతుంటే వాళ్ల మరణాన్ని కోరుకుంటున్న నీచ బుద్ధి సీఎంది. ఇప్పటికైనా అడ్డగోలు మాటలు మాని ఇచ్చిన హామీలు అమలు చేయడంపై దృష్టి పెట్టాలి. కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. -ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
పరిపాలన చేతగాక కేసీఆర్ పై విమర్శలా..
పరిపాలన చేతకాకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై లేనిపోని విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిత్యం అబద్ధాలతో కాలం గడుపుతున్నారు. కాంగ్రెస్ హయాంలో 20 వేల ఉద్యోగాలు ఇచ్చి 50 వేల ఉద్యోగాలు ఇచ్చానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారు. – ఎమ్మెల్యే ముఠా గోపాల్
సీఎం వ్యాఖ్యలు దారుణం
తెలంగాణ ఉద్యమ సారథి, రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన కేసీఆర్‌ను ఉద్దేశించి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దారుణం. రాజకీయ పార్టీలకు మధ్య విభేదాలు సహజమే. అయితే తమకు నచ్చని వారికి భౌతికంగా హాని కలగాలని ఆలోచన చేయడం అత్యంత తీవ్రమైన అంశం.
జూబ్లీహిల్స్ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
అడ్డగోలు మాటలు వద్దు..
మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు తీవ్ర ఆక్షేపనీయం. పెద్ద వారిని తిడితే పెద్దగా ఐపోతానని రేవంత్ భావిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని, రేవంత్‌రెడ్డిని ప్రజలు వెంటిలేటర్ మీద పడుకోబెట్టారు. తులసీ తీర్థం పోసే సమయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. మరోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం దింపుడు కల్లెం ఆశలే. ఇప్పటికైనా అడ్డగోలు మాటలు మాని ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఆమలు చేయడంపై రేవంత్‌రెడ్డి దృష్టి సారించాలి.
-టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్ రావు
తెలంగాణ ప్రజలను అవమానించడమే..
మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యాలు సరికాదు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి భాష మాట్లాడడం బాధాకరం. తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు సైతం త్యాగం చేయడానికి సిద్ధపడిన వ్యక్తిని ఇలా కించపరచడం తెలంగాణ ప్రజలను అవమానించడమే.
– ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
బర్తరఫ్ చేయాలి
మాజీ కేసీఆర్‌పై… అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర గవర్నర్ వెంటనే బర్తరఫ్ చేయాలి. భారత రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన… రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను న్యాయస్థానం సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలి. ఇద్దరు మహిళా జర్నలిస్టు వార్తలు రాస్తే కేసు నమోదు చేసి జైలుకు పంపించిన పోలీసులు… రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి జైలుకు పంపాలి.
– ఎమ్మెల్యే కృష్ణారావు
మీ ప్రభుత్వాన్ని మార్చురీకి తీసుకుపోతారు
మీ ప్రభుత్వాన్ని ప్రజలు స్ట్రేచర్ మీదికి తీసుకుపోతారో, స్ట్రేచర్ మీద నుంచి మార్చురికి తీసుకుపోతారో గమనిస్తూనే ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. మీ పరిపాలనకి కాలం చెల్లి సమయం దగ్గర పడింది.
-బీఆర్ఎస్ సీనియర్ నేత గజ్జల నాగేశ్