అమీర్ పేట, ఫిబ్రవరి 21: అమెరికన్ ఫుట్ బాల్, ఫ్లాగ్ ఫుట్ బాల్ అకాడమీలు తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు కృషి జరుగుతోందని తెలంగాణ అమెరికన్ ఫుట్బాల్ అసోసియేషన్ (టాఫా) నూతన అధ్యక్షులు చాగన్ల బల్విందర్ నాథ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమెరికన్ ఫుట్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్ లను ప్రోత్సహించి అభివృద్ధి చేయాలన్న టాఫా లక్ష్యంలో భాగంగా రాష్ట్ర నలుమూలల్లో ఈ క్రీడల అభివృద్ధికి సంబంధించి క్షేత్రస్థాయి చర్యలపై దృష్టి పెట్టి రాష్ట్రంలో మంచి క్రీడా సంస్కృతిని రూపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
(2025 – 28) కాలానికి టాఫా నూతన అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శుక్రవారం బేగంపేట్ లోని హోటల్ హరిత ప్లాజాలో జరిగిన సమావేశంలో రాబోయే రోజుల్లో టాఫా చేపట్టనున్న కార్యక్రమాలను సంస్థ ప్రధాన కార్యదర్శి నడిపల్లి సుధాకర్ రావు, భారత జట్టు కెప్టెన్ (అమెరికన్ ఫుట్బాల్) జీవి మణికంఠ రెడ్డి, ఏ ఎఫ్ ఎఫ్ ఐ సీఈవో సందీప్ చౌదరి ఎల్లాతో కలిసి వెల్లడించారు. ఈ సందర్భంగా బల్వీందర్ నాథ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమెరికన్ ఫుట్బాల్ ఫ్లాగ్ ఫుట్బాల్ అకాడమీ స్థాపించేందుకు సంస్థ సిద్ధంగా ఉందని, ఇది యువతకు ఔత్సాహిక అథ్లెట్లకు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ క్రీడలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తుందని అన్నారు.
ఈ క్రీడలను రాష్ట్ర వ్యాప్తంగా మండలాలు జిల్లాల స్థాయిలో విస్తరించేందుకు వీలుగా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు స్థాయిలో ఔత్సాహిక క్రీడాకారులను ఎంపిక చేసి తగిన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జిల్లా స్థాయిలో టాఫా అసోసియేషన్లను ఏర్పాటు చేస్తూ, రాబోయే సంవత్సరాల్లో గచ్చిబౌలిలో అమెరికన్ ఫుట్బాల్ ఫ్లాగ్ ఫుట్బాల్ క్రీడాకు సంబంధించి అంతర్జాతీయ మ్యాచ్లను నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. టాఫా ఉద్దేశాలను తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు.