వ్యవసాయ యూనివర్సిటీ , ఆగస్టు 17: ‘వయ్యారి భామ’ అనే కలుపు మొక్క పంటలకు చాలా ప్రమాదకారిణి అని, తెలంగాణలో దీని ప్రభావం అధికంగా ఉందని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ నరేందర్ రెడ్డి, అఖిల భారత సమన్వయ కలుపు నివారణ విభాగం అధిపతి డాక్టర్ రాంప్రకాశ్ అన్నారు. కళాశాల ఆవరణలో విద్యార్థులకు మంగళవారం అవగాహన సదస్సును నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ కలుపు మొక్క అన్ని నేలల్లో ఏపుగా పెరుగుతుందన్నారు. ప్రధానంగా తెలంగాణ ప్రాంతాల్లోని నల్ల, ఎర్ర, చౌడు, ఇసుక నేలల్లో మెట్ట, మాగాణీలలో అధికంగా పెరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో సాగు నీరు అధికంగా అందుబాటులోకి తీసుకు రావడంతో, పంటల సాగు గణనీయంగా పెరిగిందన్నారు. ఈసారి దక్షిణ, ఉత్తర తెలంగాణలో విడతల వారీగా కురిసిన వానలకు మెట్ట పంటలు 40-60 రోజుల దశలో, వరి వారం నుంచి రెండు వారాల దశలో ఉందన్నారు.
రైతు నిర్లక్ష్యం చేస్తే అదే స్థాయిలో వయ్యారి భామ కలుపు పెరుగుతుందని, పూత దశ రాక ముందే తొలగించాలన్నారు. వయ్యారిభామ కలుపు మొక్క కలిగించే అనర్ధాలు పంట నష్టం, నివారణ మార్గాలను వివరించారు. ఆయా గ్రామాల్లోని రైతులకు, విద్యార్థులకు సైతం శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో కాలేజీ ఫారం అధిపతి డాక్టర్ సయ్యద్ హుస్సేన్, ప్రధాన శాస్త్రవేత్త డా. బి.పద్మజ, కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగ అధికారులు డా. అరుణ, శైలజ, శకుంతల పాల్గొన్నారు.