ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 25: ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ప్రతి సంవత్సరం నిర్వహించే ‘టెక్నోస్మానియా 2023’ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే పేపర్, పోస్టర్ ప్రజంటేషన్, క్విజ్, సింగింగ్, డ్యాన్సింగ్, షార్ట్ ఫిల్మ్ మేకింగ్, ట్రెజర్ హంట్ తదితర విభాగాలలో పోటీల్లో దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీ విద్యార్థులు పాల్గొననున్నారు. వేడుకల ప్రారంభోత్సవానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చింత సాయిలు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ప్రొఫెసర్, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డుల గ్రహీత ప్రొఫెసర్ ఎం.ఎం.శర్మ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధి సాంకేతిక విద్యార్థుల పైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. అభివృద్ధి, ఆవిష్కరణలు ప్రధానంగా యూనివర్సిటీల నుంచే ఉంటాయని అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీలు, పరిశ్రమల మధ్య మంచి సంబంధాలు ఉండాలని చెప్పారు. విద్యార్థులకు ప్రాజెక్టులతో అనేక ఉపయోగాలుంటాయని.. అయితే చాలా మంది విద్యార్థులు ప్రాజెక్టుల్లో భాగంగా పరిశ్రమలకు వెళ్లకుండా మెటీరియల్ కొనుగోలు చేస్తున్నారని అన్నారు. అన్ని రంగాల ఇంజినీరింగ్ విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం చూస్తున్నారని ఇది మంచిది కాదని హితవు పలికారు. విద్యార్థులు పరిశోధనా దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. సైన్స్, టెక్నాలజీ విద్యార్థులు సృజనాత్మకతో ఆలోచించాలన్నారు. ఎంత చదివినా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే సృజనాత్మకత అబ్బదని చెప్పారు.
27 ఏండ్ల వయసులో ప్రొఫెసర్ అయిన తాను ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ అవార్డు పొందిన మొదటి భారతీయ కెమికల్ ఇంజినీర్‌గా నిలిచానని వివరించారు. ఓయూ, ఐఐసీటీలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. టెక్నోస్మానియా కన్వీనర్ డాక్టర్ జ్యోతి తాటి మాట్లాడుతూ కార్యక్రమ వివరాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ఐఆర్ – సీఎఫ్టీఆర్ఐ మాజీ డైరెక్టర్, ఐఐటీ తిరుమతి ఎమినెంట్ ప్రొఫెసర్ కేఎస్ఎంఎస్ రాఘవరావు, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ హయవదన, కెమికల్ ఇంజినీరింగ్ విభాగం హెడ్ ప్రొఫెసర్ రమేశ్‌కుమార్, ఫుడ్ టెక్నాలజీ విభాగం హెడ్ ప్రొఫెసర్ వీవీ బసవరావు, కో కన్వీనర్ డాక్టర్ పరుశురాములు, ఫ్యాకల్టీ కో ఆర్డినేటర్లు డాక్టర్ భాస్కర్, డాక్టర్ అజిత్‌కుమార్, డాక్టర్ అభిలాష్, అయోధ్య కవిత, అరున, అనురాధ, స్టూడెంట్ కో ఆర్డినేటర్లు తేజస్, గురుప్రసాద్, సహజ, అహ్మద్‌ఖాన్, రిషిత, వెంకటరమణారావు, స్వాతి, శశికాంత్, యామిని, సాయివంశీ పాల్గొన్నారు.