Hydraa | నాలుగు నెలల క్రితం హైడ్రా వచ్చింది.. మా ఇల్లు కూల్చేసింది.. ఎందుకు కూల్చారో తెలియదు.. ఎఫ్టీఎల్ అన్నారు. కూలగొట్టిపోయారు.. బ్యాంకుల్లో తీసుకున్న హౌసింగ్‌లోన్ ఈఎంఐలు మాత్రం కట్టక తప్పడం లేదు. మేము అవునన్నా.. కాదన్నా నెల కాగానే ఈఎంఐ ఠంచన్‌గా కట్ అవుతూనే ఉంది. ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లూ పోయింది.. దానికి తోడు ఇంటి పేరు మీద తీసుకున్న లోన్ పేరుతో మా డబ్బులు పోతున్నయ్. మేం ఎవరికి చెప్పుకున్నా లాభం లేదు. నెలకు యాభైవేలకు పైగానే కట్ అవుతున్నాయి. ఇది అన్యాయం. మధ్యతరగతి వారిపైనే మీ ప్రతాపమా. అసలు అనుమతులిచ్చిందెవరు.. బ్యాంకులు లోన్ ఇచ్చేటప్పుడు వెరిఫికేషన్‌లోనే డాక్యుమెంట్స్ సరైనవా కావా తేల్చేస్తారు. మరి వాళ్లకు కూడా చెరువులో కట్టామని తెలియదా.. 2019లో కొన్న ఇంటికి ఇప్పుడు ఎఫ్టీఎల్ గుర్తుకు వచ్చిందా.. ఇదేం తీరు. హైడ్రా పేరుతో భయపెడుతున్నారు. మా జీవితాలు నాశనం చేశారు. మీరెలా బాగుపడుతారంటూ ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
– సిటీబ్యూరో/దుండిగల్, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ)
హైడ్రా చేసిన గాయాలు మానడం లేదు. ఒకవైపు ఇల్లు నేలమట్టమై కంటిముందు కనిపిస్తుంటే . మరోవైపు ఈఎంఐలు కట్టాలంటూ బ్యాంకుల ఒత్తిడి ఆగడం లేదు. బ్యాంకులు ఇళ్ల నిర్మాణానికి లోన్లు ఇవ్వాలంటే రిజిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల నుంచి అనుమతులు తీసుకున్నారా లేదా చెక్ చేసిన తర్వాతే రుణాలు ఇస్తారు. ఈ మూడు శాఖలు ఇచ్చిన సర్టిఫికెట్లను చెక్ చేసి న్యాయ నిపుణుల సలహాలతోనే ఈ ఇళ్లకు రుణాలు మంజూరు చేస్తాయి.
బ్యాంకులు లోన్లు ఇచ్చేటప్పుడు చూసుకున్న డాక్యుమెంట్లన్నీ సరిగా ఉంటేనే కదా లోన్లు ఇచ్చేది.. మరి అలాంటిది తమ ఇల్లు బఫర్‌జోన్, ఎఫ్టీఎల్లో ఉంటే బ్యాంకులు లోన్లు ఎలా ఇచ్చాయి.. రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి.. మాది తప్పంటూ ఇళ్లు కూల్చేసి మేము రోడ్డున పడ్డాక ఇప్పుడు ఈఎంఐలు బలవంతంగా కట్ చేయడమేంటి.. బాధితులు కన్నీటిపర్యంతమవుతూ వేస్తున్న ప్రశ్నలివి. హైడ్రా రెండున్నర నెలల్లో చేసిన కూల్చివేతల్లో పేద, మధ్యతరగతి వారే ఎక్కువగా నష్టపోగా.. వారి జీవితాలు అగమ్యగోచరంగా మారాయి.
పుండుపై కారం చల్లినట్లు ఒకవైపు ఇల్లు కూలగొట్టారంటూ వాళ్లు బాధపడుతుంటే ఈఎంఐలు కట్టించుకోవడంలో బ్యాంకులు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నాయి. మల్లంపేట్ కత్వా చెరువు వద్ద విల్లాల యజమానులు ఈఎంఐలు కట్ అవుతూ నానా అవస్తలు పడుతున్నారు. తమ కలల సౌధాన్ని కంటి ముందే కూల్చేస్తుంటే కాళ్లావేళ్లా పడ్డా హైడ్రా అధికారులు వినకుండా కూల్చేశారంటూ పుట్టెడు దుఃఖంతో చెబుతున్నారు.
ఒకవైపు ఇల్లు కూల్చేసి పోతుంటే ఉన్న జాగ అయినా తమది అవుతుందనుకుంటే అది పేపర్ల మీద ఉంటుంది తప్ప మీది కాదని అధికారులు చెబుతున్నారంటున్నారు. బ్యాంకులకు ఈఎంఐలు చెల్లించడం విషయంలోనైతే వారి బాధ వర్ణనాతీతం. ప్రతీనెల ఠంచనుగా తమ ఎకౌంట్ నుంచి ఈఎంఐలు కట్ అవుతూనే ఉన్నాయని చెప్పారు. వారికి రుణాల కోసం షూరిటీ ఇచ్చిన వారు సైతం లోన్ ఈఎంఐ కట్టకపోతే తమ జీతాల్లో ఎక్కడ కోత పెడుతారోనంటూ ఈ బాధితుల చుట్టే తిరుగుతున్నారు. కోట్లు ఖర్చు చేసి కట్టుకున్న విల్లాల నుంచి లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ఇళ్ల వరకు హైడ్రా నష్టాన్నే మిగిల్చింది. అయితే ఈ నష్టాన్ని ఎవరు మోయాలన్న ప్రశ్న వ్యక్తమవుతోంది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్లంపేటలోని కత్వా చెరువు వద్ద 17 విల్లాలను హైడ్రా కూల్చివేసింది. లక్షలాది రూపాయల లోన్ తీసుకుని నిర్మించుకున్న ఇళ్లు నేలమట్టమైనా బ్యాంకుల వేధింపులు మాత్రం ఆగడం లేదు. కత్వా చెరువు వద్ద కూల్చేసిన విల్లాల బాధితులను కదిలిస్తే కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. అయితే వారిలో బహిరంగంగా మాట్లాడటానికి ఎవరూ ముందుకు రావడం లేదు. వారందరిలో ఎక్కడో ఒక చిన్న ఆశ.. తమకు ప్రభుత్వం న్యాయం చేయకపోతుందా అని ఎదురు చూస్తున్నారు. కానీ సర్కార్ మాత్రం వారివైపు కన్నెత్తి చూడటం లేదు. ముఖ్యంగా కూల్చేసిన ఇళ్ల డెబ్రిస్ తీయడానికి ఒక్కో విల్లాకు తమకు రూ.3లక్షల ఖర్చయిందని బాధితులు చెబుతున్నారు.
అసలు విల్లానే లేదు.. ఈఎంఐ కట్టడం మాత్రం తప్పడం లేదు.. బ్యాంకులకు వెళ్లి తమ పరిస్థితి చెబితే వారు డైరెక్ట్‌గా తమ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ చూపించి మీరే సంతకం పెట్టారు.. కట్టాల్సిందే అంటూ సమాధానమిస్తున్నారు. మా లోన్‌కు, ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధం లేదని .. ఎమ్మార్వో , సబ్ రిజిస్ట్రార్ ఎందుకు క్లియరెన్స్ ఇచ్చారో మాకు సంబంధం లేదని బ్యాంక్‌వాళ్లు చెబుతున్నారు. ఇక రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు వెళ్లి తమ విల్లా చెరువుల హద్దుల్లో ఉంటే ఎలా రిజిస్ట్రేషన్ చేశారని అడిగితే ఆ సమయంలో మా సైట్లో చెరువుల ఎఫ్టీఎల్ వివరాలే లేవు. మాకు ఎలాంటి బ్లాక్ లిస్ట్ ఇవ్వలేదంటూ సమాధానమిచ్చారు. ఎమ్మార్వో, సబ్‌రిజిస్ట్రార్, బిల్డర్, బ్యాంక్, ఇరిగేషన్ అధికారులు.. వీరంతా తమ నష్టానికి బాధ్యులేనని అంతెందుకు ఏకంగా ప్రభుత్వమే నష్టాన్ని పూరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
హైడ్రా కూల్చివేతల బాధితులు తమ గోడు చెప్పుకోవడానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కలిశారు. ఆయన బిల్డర్‌తో మాట్లాడుకోమన్నారు. బిల్డర్ తాను కరెక్ట్‌గానే ఇల్లు కట్టానని చెబుతున్నారు. కానీ ఎందుకు కూల్చేశారో తెలియడం లేదంటున్నారని విల్లాల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల రంగనాథ్ స్వయంగా అనాథరైజ్డ్ ఇైళ్లెనా, నివాసగృహాలు అయితే కూల్చేది లేదంటూ ఇచ్చిన స్టేట్మెంట్తో వారు తమకు కూడా న్యాయం జరుగుతుందని.. నష్టపరిహారం ఇవ్వడమో, వేరొక చోట ఇల్లు ప్రత్యామ్నాయంగా ఇవ్వడమో చేస్తారని భావించారు. కానీ రంగనాథ్‌ను కలవడానికి ప్రయత్నిస్తే అవకాశమే ఉండటం లేదని, ఎవరినో కలవమంటే అతనిని కలిశామని అతను కేవలం పేపర్ మీద మీ బాధ రాసి ఇవ్వండి నేను సార్‌కు ఇస్తా అన్నాడు.. తప్ప మా బాధలు వినేవారు లేరు.. మాకు న్యాయం చేసే వారు లేరంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. తాము కట్టుకున్న ఇళ్లు పోయి ఏం చేయాలో తెలియక బ్యాంక్ లోన్ వేరే బ్యాంక్‌కు ట్రాన్స్ఫర్ చేసి దానిపై ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని రెండు నెలల తర్వాత నాచురల్ డెత్ ప్లాన్ చేస్తే కనీసం ఆ ఇల్లు అయినా మిగులుతుందని ఆవేదనగా చెబుతున్నారు.
తాము కూల్చేసిన ఇళ్లకు నష్టపరిహారం అంటూ ఏమీ ఉండదని హైడ్రా అధికారి చెప్పారు. మల్లంపేట్ విల్లాల కూల్చివేతల తర్వాత తమ ఆఫీసుకు విల్లాల యజమానులు వచ్చినా తమ పరిధిలో తాము పనిచేశామని బిల్డర్‌తో మాట్లాడమని చెప్పాం. కూల్చివేతలకు నష్టపరిహారం కానీ ప్రత్యామ్నాయ ఇళ్లు చూపించడం కానీ ఉండదు. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో కట్టిన విల్లాలను కూల్చేశాం.
కత్వా చెరువు సమీపంలో విల్లా కొనేందుకు రూ. 70 లక్షల లోన్ తీసుకున్నాను. నాలుగు నెలల క్రితం మా ఇల్లు హైడ్రా కూల్చేసింది. అయినా ప్రతీనెలా రూ.51,258 ఈఎంఐ నా అకౌంట్ నుంచి కట్ అవుతోంది. న్యాయం కోసం ప్రతీ అధికారిని కలిశాం. ఎక్కడా మా గోడు వినే దిక్కే లేదు. ఇదెక్కడి ప్రభుత్వం. మా ఇల్లు కూల్చేసి మాకు వేరే దారి చూపించదా. బ్యాంక్‌లకు వెళ్లి ఏదైనా రిక్వస్ట్ చేస్తే వన్‌టైమ్ సెటిల్మెంట్ చేసుకోండి.. అంటున్నారు.. తప్ప మా నష్టాన్ని పట్టించుకోరట. ఇక హైడ్రా ఆఫీస్‌కు వెళ్లినా.. కమిషనర్‌ను కలిసినా ఏం ఫలితం లేదు. న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలి.. ఎవరిని కలవాలి. సర్కార్ తీరే బాగాలేదు. పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఎందుకింత పగపెట్టుకుందో అర్థం కావడం లేదు మాకు తెలిసి మేం చెరువుల్లో ఇళ్లు కట్టుకుంటామా. ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇలా కూల్చివేస్తే ఎంత బాధ. అది రేవంత్‌రెడ్డికి తెలియడం లేదా. మేం కట్టే ఈఎంఐ డబ్బులతో మా పిల్లలు బాగుపడరా. ఇల్లు ఉంటే లోన్ కట్టినా సంతోషపడే వాళ్లం. ఇలా లేని ఇంటికి ఎలా కట్టాలి.
– శశాంక్, మల్లంపేట్