మన్సూరాబాద్, ఆగస్టు 14: రెండవ తరగతి చదువుతున్న విద్యార్థిపై స్కూల్ టీచర్ పైశాచికం చూపించడాన్ని నిరసిస్తూ అతడితోపాటు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం మన్సూరాబాద్‌లోని బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్ ముందు విద్యార్థి తండ్రి, బంధువులు ఆందోళనకు దిగారు. విద్యార్థి తండ్రి కృష్ణ చైతన్యరెడ్డి కథనం ప్రకారం.. ఎల్బీనగర్ చైతన్యపురికి చెందిన కృష్ణ చైతన్యరెడ్డి కుమారుడు (7) మన్సూరాబాద్‌లోని బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్లో రెండవ తరగతి చదువుతున్నాడు.
ఈ మధ్య కాలంలో ఆ విద్యార్థి ఇంట్లో ఎవరితో మాట్లాడుకుండా ఆందోళనగా, నిరుత్సాహంగా ఉంటున్నాడు. స్కూల్ వెళ్లాలంటే భయపడుతున్నాడు. నెల రోజులుగా సదరు బాలుడిని పాఠశాలకు పంపడం లేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు తమ కుమారుడిని సైక్రియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లి చూపించారు. ఎవరో వేధించడం వలనే బాలుడు ఆందోళన పడుతున్నాడని సైక్రియాట్రిస్ట్ తెలిపాడు. పాఠశాలకు వచ్చి సీసీటీవీ ఫుటేజ్‌లను చూపాలని యాజమాన్యాన్ని కోరినప్పటికీ.. ఫుటేజ్ ఇవ్వడానికి వారు నిరాకరించారు.
ఇతర మార్గాల ద్వార సీసీటీవీ ఫుటేజ్‌లను తీసుకుని పరిశీలించగా బాలుడిపై పెన్సిల్‌తో కండ్లల్లో కుచ్చడం, చేతిని మలచడం, నోటికి టేపు వేయడం లాంటి దృశ్యాలు గమనించారు. తమ కొడుకుతో పాటు మరో ఐదుగురు విద్యార్థులను ఈ విధంగా టీచర్ వేధింపులకు గురి చేయడం స్పష్టంగా కనిపించింది. వెంటనే విషయాన్ని కలెక్టర్, డీఈఓ, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. కమిషన్ చైర్పర్సన్ విచారణ చేసి విద్యార్థిని వేధింపులకు గురి చేశారని నిర్ధారణ చేసి పాఠశాలకు నోటీసులు అందజేసినట్లు బాలుడి తండ్రి తెలిపారు.
అయితే బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ యాజమాన్యం ఒకసారి వచ్చి కలవాలని కోరడంతో గురువారం బాలుడి తండ్రి కృష్ణ చైతన్యరెడ్డి తన బంధువులతో కలిసి పాఠశాలకు వెళ్లాడు. అయితే మాట్లాడేందుకు స్కూల్‌కు వెళ్లిన తమపై పాఠశాల సెక్యురిటీ సిబ్బంది దాడి చేశారని కృష్ణ చైతన్యరెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాలుడి తండ్రి కృష్ణ చైతన్యరెడ్డి తెలిపారు.
అయితే దీనికి ప్రతిగా.. మాట్లాడేది ఉందంటూ బాలుడి తండ్రితో పలువురు పాఠశాలలోకి చొచ్చుకువచ్చి అకారణంగా సెక్యూరిటీ సిబ్బందిపై దాడిచేసి గాయపరిచారని స్కూల్ యాజమాన్యం ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇరువురి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగ, ఈ సంఘటనకు కారకురాలైన టీచర్‌ను యాజమాన్యం విధుల నుంచి తొలగించినట్లు సమాచారం.