సైదాబాద్, ఆగస్టు 6: అల్లరి చేస్తున్నాడనే కారణంతో ఓ ఎల్కేజీ విద్యార్థి తలపై టిఫిన్ బాక్స్‌తో టీచర్ కొట్టడంతో విద్యార్థికి తలపై గాయాలైన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తీవ్ర రక్తస్రావం కావటంతో ఆ చిన్నారిని దవాఖానకు తరలించగా వైద్యులు 3 కుట్లు వేశారు. ఈ విషయమై ప్రశ్నించిన బాలుడి తండ్రి పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా మాట్లాడటంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. సైదాబాద్ ఎల్సీహెచ్ కాలనీలో నివాసం ఉండే ఆవుల మణికంఠ కుమారుడు ఆవుల ఈశ్వర్ స్థానిక ప్రసన్నాంజనేయస్వామి కాలనీలోని లిటిల్ ఇండియన్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. బుధవారం మధ్నాహ్నం ఆవుల ఈశ్వర్ని స్కూల్ టీచర్ తనీషా క్లాస్‌లో అల్లరి చేస్తున్నావంటూ అకారణంగా టిఫిన్ బాక్స్, బ్యాగ్‌తో తలపై గట్టిగా కొట్టింది. బాలుడికి తీవ్ర రక్తస్రావం అయ్యింది.
అయొదే మా కొడుకు గ్రౌండ్లో కింద పడటంతో తలకు గాయమైందని ప్రిన్సిపాల్ ఫోన్ చేసి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వెంటనే కుటుంబ సభ్యులు బాలుడిని దవాఖానకు తరలించగా, వైద్యులు పరీక్షించి బాలుడి తలకు 3 కుట్లు వేసి చికిత్స చేశారు. తమ కుమారుడి గాయానికి గల కారణాలను చెప్పాలని, పాఠశాలలోని సీసీ కెమోరాల పుటేజ్‌లను చూపించాలని ప్రిన్సిపాల్‌ను బాలుడి తండ్రి మణికంఠ కోరాడు.
సరైన కారణం చెప్పకుండా ప్రిన్సిపాల్.. కెమెరాలు పని చేయటంలేదని, డబ్బులు ఇస్తాం ట్రీట్మెంట్ చేయించుకోండని, తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేశారని ఆయన ఆరోపించారు. తమ కుమారుడిని గాయపర్చిన వారిపై చర్యలు తెలుసుకోవాలని కుటుంబ సభ్యులు పాఠశాల వద్దకు ఆందోళన చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని సైదాబాద్ మండల విద్యాశాఖ అధికారులకు, సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.