విశ్వనగరంగా వెలుగొందాల్సిన హైదరాబాద్ నగరాన్ని సమస్యల సుడిగుండంలోకి నెట్టేలా కాంగ్రెస్ సర్కారు అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నది. టీడీఆర్ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన 95 జీవోతో నగర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. అశాస్త్రీయమైన రీతిలో నిబంధనలను సడలిస్తూ , టీడీఆర్ పేరుతో ఇరుకైనా రోడ్లలోనూ అదనపు అంతస్తులకు అనుమతి ఇస్తామనడంపై నిపుణులు నిప్పులు చెరుగుతున్నారు. 40 ఫీట్ల రోడ్లలో మూడు అదనపు అంతస్తుల వరకు అవకాశం, 60 అడుగుల రోడ్డులో నాలుగు అదనపు అంతస్తుల వరకు టీడీఆర్‌తో అవకాశం కల్పించడం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. టీడీఆర్ ముసుగులో ఇరుకైనా రోడ్లపై అదనపు అంతస్తులు నిర్మించుకోవచ్చన్న వెసులుబాటు నగరాన్ని ట్రాఫిక్ నరకంగా మార్చడమేనని మేధావులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యలో జనసాంద్రతకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సింది పోయి, ఉన్న వనరులపైనే భారం మోపే దిశగా సరారు వేస్తున్న అడుగులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
– సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : గత బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడేలా ప్రణాళికలు ఉండేవి..ముఖ్యంగా హైరైజ్ (బహుళ అంతస్తుల) నిర్మాణాల విషయంలో రోడ్డు వెడల్పు, ప్రజల భద్రత, అగ్నిమాపక సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని కఠినంగా వ్యవహరించింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం కొందరి బిల్డర్ల ప్రయోజనాలే పరమావధిగా నిబంధనలను నీరుగార్చింది. 18 మీటర్ల ఎత్తు వరకు ఉన్న భవనాలను సాధారణ భవనాలుగా పరిగణించే చోట..ఆ పరిమితిని ప్రస్తుతం 21 మీటర్లకు పెంచారు.
గతంలో 2000 చదరపు మీటర్ల కంటే తక్కువ ఉన్న ప్లాట్లలో బహుళ అంతస్తుల నిర్మాణాలను అనుమతి ఉండేది కాదు..కానీ ఇప్పుడు 750 నుంచి 2000 చదరపు మీటర్ల లోపు ఉన్న ప్లాట్లలో కూడా టీడీఆర్ ద్వారా అదనపు అంతస్తుల నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. రోడ్డు వెడల్పు పెంచకుండానే టీడీఆర్ వినియోగించడం ద్వారా 40 అడుగుల రోడ్లు ఉన్న చోట అదనంగా మూడు అంతస్తులు, 60 అడుగులు ఉన్న చోట 4 అంతస్తులు, 80 అడుగుల రోడ్డు ఉంటే 5 అదనపు అంతస్తులు నిర్మించుకోవచ్చన్న వెసులుబాటు కల్పించారు.
తద్వారా ఇప్పటికే గల్లీ రోడ్లలో ట్రాఫిక్‌తో నగరవాసులు నలిగిపోతున్నారు..ఇప్పుడు 40 ఫీట్లు, 60 ఫీట్ల రోడ్లలో భారీ అపార్ట్మెంట్లు వస్తే వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతాయి. అదనపు అంతస్తుల వల్ల డ్రైనేజీ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. మంచినీటి కొరత ఏర్పడడమే కాకుండా వర్షాకాలంలో మురుగు నీరు రోడ్లపై పొంగిపొర్లె ప్రమాదం ఉంది. భూ గర్భజలాల సమస్య విపరీతంగా పెరగనున్నది. అగ్ని ప్రమాదాలు లేదా ఇతర అత్యవసర సమయాల్లో 40 ఫీట్ల రోడ్డులోకి భారీ ఫైర్ ఇంజన్లు వెళ్లడం కష్ట సాధ్యం. భవన నిర్మాణం తగ్గట్టుగా రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్ వంటి కనీస మౌలిక సదుపాయాలు మెరుగుపరచకపోతే హైదరాబాద్ నగరం నివసించడానికి యోగ్యం కాకుండా పోయే ప్రమాదం ఉందని, ముఖ్యంగా ట్రాఫిక్ రద్దీ విషయంలో మరో బెంగుళూరు అయ్యే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అప్పుడు అలా..ఇప్పుడు ఇలా
హైరైజ్ భవనాలకు ఊతమిచ్చే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ నిబంధనలపై గతంలో కాంగ్రెస్ నేతలే గగ్గోలు పెట్టారు. బీఆర్ఎస్ సర్కారు హైరైజ్ భవనాలతో బిల్డర్లకు రెడ్ కార్పెట్ వేసిందని, కేవలం నిర్మాణ రంగ సంస్థలకు ప్రయోజనం కోసమే హైరైజ్ అంతస్తుల్లో పరిమితులను బీఆర్ఎస్ విధించలేదని ఆరోపించారు. కానీ ఇప్పుడు అదే హైరైజ్ భవనాల విషయంలో కాంగ్రెస్ సర్కారు చేస్తున్న చేష్టలు వికృత రూపం దాల్చాయనేది స్పష్టం అవుతుంది. హైరైజ్ భవనాల విషయంలో గతంలో ఎక్కడా లేని నిబంధనలను రేవంత్ సర్కారు తీసుకువచ్చింది.
ఈ జీవో 95లోని రూల్ నెం. 17(ఎఫ్) ప్రకారం హైరైజ్ భవనాల ఎత్తును బట్టి అదనపు నిర్మాణ విస్తీర్ణంపై టీడీఆర్ భారం వేశారు. 10 నుంచి 20 అంతస్తుల వరకు ఉంటే.. 10వ అంతస్తు పైబడి ఉన్న విస్తీర్ణంలో 3 శాతం టీడీఆర్ వాడాలి. 20 అంతస్తులు దాటితే.. ఆ పైన ఉన్న విస్తీర్ణంలో 5 శాతం టీడీఆర్ లోడ్ చేయాలి. ఇలా టీడీఆర్‌ను తప్పనిసరి చేయడం ద్వారా బిల్డర్లపై భారం మోపి, ఆ మొత్తాన్ని ముఖ్యనేత బంధువులు, అనుచరుల జేబుల్లోకి మళ్లించే భారీ సెచ్ వేశారని విమర్శలు వస్తున్నాయి. అన్నింటి కంటే మించి టీడీఆర్‌తో సర్కారు ఖజానాకు వచ్చే ఆదాయం పెరిగేది ఉండదు. కానీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న టీడీఆర్ సర్టిఫికెట్లకు డిమాండ్ మాత్రం పెరుగుతోంది. 10ఫ్లోర్లు దాటితే తప్పనిసరి చేయడంతో మొత్తం భవన నిర్మాణ విస్తీర్ణంలో 3-5శాతం టీడీఆర్ ఉండాల్సిందే. ఇక చేతిలో టీడీఆర్ ఉంటే ఎయిర్‌పోర్టు అథారిటీ నిబంధనలు మినహా ఎన్ని అంతస్తులైన కట్టుకునేలా అవకాశం ఉంది. గతంలో హైరైజ్ అంతస్తులు పెరిగిన కొద్ది సర్కారుకు ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు టీడీఆర్ రూపంలో ఆదాయం కూడా తగ్గనుంది.
సాధారణ పౌరులకు శాపం..
సాధారణ అపార్ట్మెంట్లతో పోల్చితే… హైరైజ్ భవనాల అనుమతులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఏమాత్రం ఉల్లంఘనలకు ఆస్కారం ఉండకూడదు. దీనికి అనుమతులు ఇచ్చే విధానం కూడా ఎంఎస్బీ కమిటీ ఆమోదంతోనే జరుగుతాయి. కానీ చేతిలో టీడీఆర్ ఉంటే సెట్ బ్యాక్ నుంచి మొదలుకుని, అదనపు ఫ్లోర్ల వరకు అన్నింటికి మార్గం సుగమం చేసేలా నిబంధనలు రూపకల్పన చేశారు. హైరైజ్ భవనాల్లో 10 శాతం వరకు సెట్ బ్యాక్ సడలింపులను టీడీఆర్ ద్వారా అనుమతించడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది బిల్డర్లకు లాభదాయకంగా మారినప్పటికీ, సాధారణ పౌరులకు మాత్రం శాపంగా మారే అవకాశం ఉంది. ఉల్లంఘనల పునాదులపై నిర్మించే ఈ బహుళ అంతస్తులు నగర మౌలిక స్వరూపాన్నే దెబ్బతీస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.