సిటీబ్యూరో/వెంగళరావునగర్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : చిరువ్యాపారులపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు తమ ప్రతాపం చూపుతున్నారు. నకిలీ వస్తువులు విక్రయిస్తున్నారని.. కేసులు పెడతామని భయపెట్టి రూ.లక్షల్లో డిమాండ్ చేయడం, స్టేషన్‌కు ఈడ్చుకెళ్లి రబ్బర్బ్యాట్తో చితకబాదుతూ ఎంతోకొంత ముట్టజెబితే గానీ వదిలిపెట్టకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ‘రూ.5లక్షలు ఇచ్చుకో.. కేసు లేకుండా చేసుకో’ అని బెదిరించడమే గాక ఇలాంటి ‘నకిలీ’ కేసులు మరికొన్ని చూపించాలంటూ ‘టాస్క్’ పెట్టి మరీ బాధితులను ‘ఫోర్స్’ చేయడం ఖాకీలకే చెల్లుతున్నది.
తాము పట్టుకున్న వస్తువులను రేట్ ఫిక్స్ చేయడమే గాక.. బేరసారాలు నడిపేందుకు బంజారాహిల్స్‌లోని ఓ కేఫ్‌ను అడ్డాగా చేసుకున్నట్టు తెలిసింది. నగరంలోని అత్యంత కీలకమైన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. చేతికిచిక్కిన చిరువ్యాపారులను వేధించడం టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సర్వసాధారణమైపోయిందనే విమర్శలు.