అమీర్‌పేట్, ఆగస్టు 22 : వాస్తవదూరమైన ప్రకటనలు చేయడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. కోవిడ్ చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నగరంలోని సనత్‌నగర్, కొత్తపేట, అల్వాల్ ప్రాంతాల్లో సకల వసతులతో కూడిన టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలకు 2022లో అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్ధాపన చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి టిమ్స్ నిర్మాణాలు దాదాపు 80 శాతం పూర్తయ్యాయని చెప్పారు.
అయితే ఇటీవల ప్రారంభోత్సవం సందర్భంగా టిమ్స్ నిర్మాణాలు తామే చేపట్టామని చెప్పుకోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పౌర సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేశామని గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సనత్‌నగర్, బాలానగర్ మధ్య దూరాన్ని తగ్గించేందుకు రైల్వే ట్రాక్ కింద నుండి రూ.100 కోట్ల వ్యయంతో గత ప్రభుత్వం తలపెట్టిన అండర్ పాస్ నిర్మాణాలు కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. వీటితో పాటు ఫతేనగర్ ఫ్లై ఓవర్ విస్తరణ వంటి అనేక పనులను ప్రభుత్వం నిలిపివేసిందన్నారు.
కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎమ్మెల్యే తలసాని రూ.2.25లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇటీవల రాజరాజేశ్వరినగర్ పర్యటనకు విచ్చేసిన సందర్భంగా స్థానిక మహిళలు కాలనీలో చోటు చేసుకుంటున్న అసాంఘిక కార్యకలాపాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చి, కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయగా, అందుకు స్పందించిన ఎమ్మెల్యే ఆర్థిక సాయం అందించారు. శనివారం ఉదయం కాలనీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని ఈ సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొలను బాల్‌రెడ్డి, పుట్టల శేఖర్, సురేష్‌గౌడ్, వి.కరుణాకర్కరెడ్డి, రాజేష్ ముదిరాజ్, బోగి బాల్‌రాజ్, కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్‌రెడ్డి, నారాయణ, వాడకట్టు శ్రీకాంత్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.