బన్సీలాల్ పేట్, జూన్ 28 : మీ ఇండ్లు మీకేనని.. ఎవరూ ఆందోళన చెందవద్దని.. అన్నింటికీ తాను అండగా ఉంటానని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు. తమ ఇండ్లను రెవెన్యూ అధికారులు సర్వే చేయడంతో ఆందోళన చెందిన రామస్వామి కాంపౌండ్, బర్కల్ బస్తీ వాసులు ఎమ్మెల్యేను కలిసి తమ ఆవేదన వెలిబుచ్చారు. దీంతో ఆయన బస్తీలలో పర్యటించి స్థానిక ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్న మిమ్మల్ని ఎవరూ ఖాళీ చేయించలేరని దైర్యంగా ఉండాలని చెప్పారు. తాను మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పొజిషన్ సర్టిఫికెట్లను ఇప్పించే బాధ్యత తనదని ప్రకటించారు.
బస్తీలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని చెప్పారు. తాను కలెక్టర్‌తో మాట్లాడానని, ఇక్కడి వాస్తవ పరిస్థితులను వివరించేందుకే కోర్టు ఆదేశాల మేరకు అధికారులు సర్వే నిర్వహించినట్లు వివరించారు. బాధితుల కోసం ఎంతటి పోరాటానికైనా వెనుకాడబోనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ కుర్మ హేమలత, ముషీరాబాద్ తహసీల్దార్ రాణా ప్రతాప్ సింగ్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు లక్ష్మీపతి, ప్రేమ్ కుమార్, నాగభూషణం, సురేష్, బస్తీ వాసులు పాల్గొన్నారు.