రాష్ట్రంలో ని లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వం పై వత్తిడి తీసుకురావాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా వచ్చి వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయం వద్ద కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడవద్దనే ఆలోచనతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెం ట్ను తీసుకొచ్చారని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా విద్యార్థులు ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా సకాలంలో స్కాలర్ షిప్ లు,ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 11 వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిందని మండిప డ్డారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించని కారణంగా చదువు పూర్తయిన విద్యా సంస్థల యాజమాన్యాలు సర్టిఫికెట్ లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులు కూడా మానసికంగా ఆందోళన చెందుతున్నారని అన్నారు. విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే పోరాటాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు.
ప్రభుత్వం బకాయిలు చెల్లించేలా ఈ నెల 7 వ తేదీ నుండి జరిగే అసెంబ్లీ సమావేశాలలో వత్తిడి తీసుకొస్తామని చెప్పారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ విషయంలో జెన్ జీ లు నిర్వహించిన ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం వనికిపోయిందని, కేంద్రమంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పారు. అదే స్ఫూర్తితో విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధం కావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు బాలు, అభినయ్, గౌతమ్, రేవంత్ తదితరులు ఉన్నారు.