హైదరాబాద్ : దాశరథి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర సాధనకోసం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. దాశరథి ఆలోచన విధానాన్ని కేసీఆర్ ఎల్లప్పుడు ముందుకు తీసుకెళ్లారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దాశరథి జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నా తెలంగాణ కోటి రత్నాలవీణ అని తెలంగాణ వ్యాప్తంగా చైతన్యం నింపిన కవి దాశరథి అని ప్రశంసించారు. ఆనాడు తెలంగాణ ప్రాంతంలో నీళ్లు, కరెంట్ లేక రైతాంగం ఇబ్బంది పడుతున్న తీరు దాశరథి పుస్తకాలు చదివితే తెలుస్తుంది.
స్వాతంత్రం వచ్చిన తర్వాత 60 ఏండ్ల పాటు తెలంగాణ ప్రజలు గోస పడ్డారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వాయువులు రావాలని దాశరథి తన కలంతో కవితలు రాశారని పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను దేశంలో అగ్రగామిగా కేసీఆర్ నిలబెట్టారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాలోతు కవిత, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్, మాజీ బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్ ఉన్నారు.