Cyber Crime | సిటీబ్యూరో, మార్చి 15 (నమస్తే తెలంగాణ): మీ పేరుతో ఐదు పాస్‌పోర్టులు, డ్రగ్స్ ఫెడెక్స్ కొరియర్లో రవాణా అవుతున్నాయి.. మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం.. అంటూ బెదిరించిన సైబర్‌నేరగాళ్లు ఒక వ్యక్తి వద్ద నుంచి రూ. 20 లక్షలు దోచేశారు. స్కైప్‌లో ఇంటర్వ్యూ చేస్తూ అతడి పూర్తి వివరాలు తీసుకొని పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి ప్రీ అప్రూవల్ లోన్ రూ. 20 లక్షలు తీసుకొని నయా పంథాలో మోసానికి పాల్పడ్డారు. నగరానికి చెందిన బాధితుడికి ముంబై సైబర్‌క్రైమ్ నుంచి మాట్లాడుతున్నామంటూ నిందితులు ఫోన్ చేశారు.
మీ ఫెడెక్స్ పార్సిల్లో ఐదు పాస్‌పోర్టులు, 30 ప్యాకెట్ల ఎల్ఎస్డీ డ్రగ్, ఒక ల్యాప్ టాప్ ఉన్నాయని, మీ ఆధార్‌కార్డు, ఫోన్ నంబర్ ఆధారంగా ముంబై కస్టమ్స్‌లో కేసు నమోదు చేశారంటూ మాట్లాడారు. విచారణ పేరుతో రెండు గంటల పాటు బాధితుడిని బెదిరించి.. వ్యక్తిగత వివరాలతో పాటు, బ్యాంకు ఖాతాల వివరాలను తీసుకున్నారు. మీపై సీబీఐలో కేసు నమోదయ్యిందని, ఎఫ్ఐఆర్ నంబర్‌ను కూడా పంపిస్తున్నామని చెప్పారు. సైబర్ నేరగాళ్లు బాధితుడి నుంచి సేకరించిన బ్యాంకు సమాచారం ద్వారా అతడి పేరుతో రూ.20లక్షల ప్రీ అప్రూవల్ లోన్ తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.