బోడుప్పల్, నవంబర్ 13 : అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయలోపంతో బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ‘రా’ చెరువు సుందరీకరణలో భాగంగా చేపట్టిన నాలా పనుల్లో అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల దిగువ కాలనీలు నీటమునిగాయి. వివరాల్లోకి వెళ్తే… కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి బోడుప్పల్ నగరపాలక సంస్థ ‘రా’ చెరువు అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించి, రూ.6 కోట్లు కేటాయించారు. చర్లపల్లి, మల్లాపూర్ పారిశ్రామిక వాడల నుంచి చెరువులోకి వస్తున్న రసాయన వ్యర్థాలు, కాలనీల నుంచి వెలువడే డ్రైనేజీవాటర్ను బాక్స్ డ్రైనేజీ ద్వారా నేరుగా మూసీలోకి పంపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు 9వందల మీటర్ల ఓపెన్ బాక్స్ డ్రైనేజీని నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. అందులో 350 మీటర్ల నాలా పనులు పూర్తయ్యాయి. చెరువు దిగువ భాగంలో ఉన్న మల్లయ్యనగర్కు చెందిన కొంతమంది నీటిని వదిలారు. దీంతో సాయిరాం నగర్, అక్షయనగర్, బుడిగజంగాల కాలనీ, రాఘవేంద్రనగర్, ద్వారకానగర్ ఫేజ్-2 పూర్తిగా ముంపునకు గురయ్యాయి. అధికారులు పర్యవేక్షణ లోపంతోనే ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరలో నీటిని దిగువకు పంపే ప్రయత్నం చేస్తున్నట్లు డీఈ కురుమయ్య తెలిపారు.
సహాయక చర్యలు చేపట్టండి : మేయర్
లోతట్టు ప్రాంతాల్లోని కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యలు తీసుకోవాలని బోడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారుల సమన్వయ లోపంతో సమస్య తలెత్తిందని, తాను అందుబాటులో లేని కారణంగా ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకున్నానని తెలిపారు. సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని డీఈ కురుమయ్యను ఆదేశించినట్లు తెలిపారు. కాలనీల ముంపునకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.