శామీర్‌పేట, ఫిబ్రవరి 16: ఈత సరదాకు మద్యం మత్తు తోడై చిన్ననాటి స్నేహితులను విడదీసింది. ఈత కొడుతు ఒకరు కాపాడేందుకు వెళ్లి మరొకరు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ సంఘటన శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. జగద్గిరిగుట్టకు చెందిన పూమాల కుమారుడు బాలు(26) బీటెక్ పూర్తి చేసి ఐటీసీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే జగద్గిరిగుట్టలో తనతో పాటు చదువుకున్న సందీప్‌సాగర్(27), రాంపల్లి సందీప్, సాయిచందర్, నాగారానికి చెందిన ఒగ్గు బాలకృష్ణ , కర్ర నితీష్‌కుమార్‌తో కలిసి పార్టీ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఆదివారం పొన్నాల్ చేరుకున్న వారంతా అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడే కోడిని కోసుకొని.. మద్యం, కల్లు తాగారు. అయితే స్నేహితుల్లోని రాంపల్లి సందీప్, సాయి చందర్, నితీష్ కుమార్ పని ఉందని పొన్నాల్‌కు వెళ్లగా.. బాలు, సందీప్ సాగర్, బాలకృష్ణ సరదాగా ఈత కొడుతామని చెరువులోకి దిగారు. అదే సమయంలో బాలు, సందీప్ సాగర్ నీట మునగగా బాలకృష్ణతో పాటు స్థానికులు రక్షించే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లతో సహాయక చర్యలు చేపట్టారు. అయినా వారి ఆచూకీ లభ్యం కాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు
ప్రారంభించారు.