సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ): వివాహమై.. విడాకుల కోసం ఎదురు చూస్తున్న ప్రియురాలిపై అనుమానంతో ప్రియుడు ఆమెను వెంబడించి ఇంట్లోకి వెళ్లి స్క్రూ డ్రైవర్‌తో దాడి చేశాడు. ఈ ఘటన మంగళవారం ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఛత్రినాక పోలీసుల కథనం ప్రకారం.. ఛత్రినాకకు చెందిన ఓ యువతికి 2019లో ఓ వ్యక్తితో వివాహమైంది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకుల కోసం కోర్టుకెళ్లారు. దీంతో యువతి తల్లి వద్దనే ఉంటున్నది. కాగా, గౌలిపురకు చెందిన మణికంఠ, యువతికి చిన్ననాటి స్నేహితుడు. వీరి స్నేహం ప్రేమగా మారింది. పెండ్లి చేసుకోవాలంటూ మణికంఠ ఆమె వెంటపడుతున్నాడు. విడాకులు మంజూరైన తరువాత పెండ్లి చేసుకుందామంటూ ఆమె కొన్నాళ్లుగా మణికంఠను దూరంగా పెడుతున్నది.
తనను దూరం పెట్టి మరొకరితో ప్రేమ వ్యవహారాన్ని నడుపుతుందనే అనుమానం మణికంఠకు వచ్చింది. ఈ అనుమానం రోజు రోజుకూ ముదిరిపోయింది. మంగళవారం ఉదయం యువతి జిమ్‌కు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చింది. ఆమెను వెంబడిస్తూ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. తలుపులకు గడియ పెట్టాడు. ఆ సమయంలో యువతి ఫోన్లో మాట్లాడుతున్నది. ఆగ్రహంతో ఊగిపోయిన మణికంఠ.. ఆమెపై తన వద్ద ఉన్న స్క్రూ డ్రైవర్‌తో ఛాతి, ముఖంపై దాడి చేశాడు. ఆమె పెద్దగా అరుస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. స్థానికులు వచ్చి మణికంఠను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. యువతి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిందని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఛత్రినాక ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.