ఖైరతాబాద్, మార్చి 28 : సమాజ సేవలో బద్రి విశాల్ పన్నాలాల్ పిట్టి ఆదర్శనీయులని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ అన్నారు. బద్రి విశాల్ పన్నాలాల్ పిట్టి 98వ జయంతి సందర్భంగా పిట్టి ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్ దక్కన్లో 20వ స్మారక ఉపన్యాస సభ జరిగింది.
తొలుత ఆయన చిత్రపటానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, విశ్రాంత జస్టిస్ సుదర్శన్‌రెడ్డితో కలిసి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన జస్టీస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ సమాజ సేవకులు బద్రి విశాల్ సామాన్యమైన కుటుంబంలో జన్మించారని, భారత స్వతంత్య్రోద్యమంలో పాల్గొన్నారని, క్విట్ ఇండియా మూవ్మెంట్, హైదరాబాద్ విమోచన పోరాటం, తొలి తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్నారన్నారు.
రామ్ మనోహర్ లోహియా లాంటి జాతీయ వాదులతో కలిసి పనిచేశారని తెలిపారు. అంతేకాకుండా పేదలకు ఉచిత విద్యా, వైద్యం అందించారని, 2003లో ఆయన మరణానంతరం ఆయన సేవలను కుటుంబ సభ్యులు కొనసాగించడం గొప్ప విషయమన్నారు. నేటి యువత రీల్స్, ఇంటర్నెట్ మోజులో పడి తమ జీవితాలకు అర్థం లేకుండా చేసుకుంటున్నారని, డబ్బు, హోదా అన్ని ఉన్నా తన జీవితాన్నే సమాజ సేవకు అంకితం చేసిన బద్రి విశాల్ పన్నాలాల్ పిట్టిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.