సిటీబ్యూరో, జూన్ 20(నమస్తే తెలంగాణ): జైల్లో దోస్తీ చేసి ఒడిశా నుంచి మహారాష్ట్రకు హైదరాబాద్ మీదుగా గంజాయి సరఫరా చేస్తున్న ఘరాన ముఠాను రాచకొండ ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఇందులో ఇద్దరు ప్రధాన సూత్రధారులు అయినప్పటికీ ఆయా పోలీస్స్టేషన్లలో వీరిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. పాత కేసుల్లో కోర్టుకు హాజరుకాకుండా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ తాజాగా రాచకొండ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ముఠా నుంచి రూ.65 లక్షల విలువైన 166కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
శుక్రవారం ఎల్బీనగర్ సీపీ కార్యాలయంలో రాచకొండ సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర, అహ్మదాబాద్‌కు చెందిన వికాస్ బాబన్ సాల్వే 2022లో అలేర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 900 కిలోల గంజాయితో పట్టుబడగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అదే జైల్లో ఒడిశాకు చెందిన మైక్ అలియాస్ రాహుల్‌తో పరిచయమైందని ఈ క్రమంలో జైలు నుంచి విడుదలైన వికాస్ పాత నేరస్థుడైన రంగనాథ్ యూరజన్ సాదేవ్, రైల్వే ఉద్యోగి నాందేడ్ సబ్‌డివిజన్‌లో నాలుగో గ్రేడ్ ఉద్యోగి సాగర్ గజానన ఖందేబారద్ అలియాస్ సాగర్, డ్రైవర్ అమోల్ నారాయణ బోరేలను ఒడిశాకు చెందిన రాహుల్‌కు పరిచయం చేయించగా వీరు ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్గిరీ నుంచి 166కిలోల గంజాయితో ఏపీ మీదుగా ఖమ్మం, సూర్యపేట్, ఓఆర్ఆర్, సంగారెడ్డి, జహీరాబాద్ మీదుగా మహారాష్ట్రకు వెళ్తుండగా ఓఆర్ఆర్ సమీపంలో ఎల్బీనగర్ ఎస్ఓటీ అదనపు డీసీపీ షకీర్ హుస్సేన్ నేతృత్వంలో ఎస్ఓటీ పోలీసులు స్థానిక హయత్‌నగర్ ఇన్స్పెక్టర్ నాగరాజుగౌడ్ బృందంతో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా గంజాయితో వెళ్తున్న వాహనం పట్టుబడింది.
కాగా ఇందులో అలేర్ పోలీస్‌స్టేషన్‌లో వికాస్‌పై, భద్రాచలం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో రంగనాథ్‌పై నాన్‌బెయిల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి గంజాయితో పాటు కారు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని డ్రగ్స్ రహిత సమాజాన్ని స్థాపించడంలో ప్రతీ ఒక్కరు కృషిచేయాలని సీపీ కోరారు.