నగరంలో బయో వ్యర్థాలు భయపెడుతున్నాయి. వీటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో సర్వత్రా ఆందోళన నెలకొన్నది. రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఈ బయో వ్యర్థాలను దవాఖానలు బహిరంగ ప్రదేశాలు, మున్సిపల్ వ్యర్థాల్లో కలుపుతున్నాయి. దీంతో నేల, గాలి కలుషితమవుతున్నాయి. ప్రజలు రోగాల బారినపడుతున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఫిర్యాదులు అందితేనే తనిఖీలు చేపడుతుండటంతో దవాఖానల యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వైద్యశాలల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో అమాయక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లోని వైద్యశాలలు బయో వ్యర్థాల నిర్వహణను ప్రణాళికాబద్ధంగా చేపట్టడం లేదు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు నిత్యం ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను మున్సిపల్ వాహనాల్లో పారబోస్తున్నాయి. మరికొన్ని దవాఖానలైతే ఏకంగా ఖాళీ స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నాయి. ఇదంతా నిత్యకృత్యంగానే సాగుతున్నా..అధికారులు మాత్రం తమకు ఫిర్యాదు వస్తేనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పడం వారి నిర్లక్ష్యానికి అద్దంపడుతున్నది.
-సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చాలా సూపర్ స్పెషాలిటీ దవాఖానల నుంచి చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ల దాకా బయో వ్యర్థాల నిర్వహణను గాలికొదిలేస్తున్నారు. ఇష్టానుసారంగా మున్సిపల్ వాహనాలు, బహిరంగ ప్రదేశాల్లో పడేస్తుండటంతో నేల, గాలి కాలుష్యం జరిగి ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. బయో వ్యర్థాలను సేకరించేందుకు కాలుష్య నియంత్రణ మండలి అనుమతితో నిర్వహిస్తున్న వాహనాలున్నాయి.
వాటిని ప్రత్యేకంగా నిర్వహించే 11 కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ 11 కేంద్రాల్లో ఒక రోజుకు 77,500 కిలో బయో వ్యర్థాలను ట్రీట్మెంట్ చేయగల సామర్థ్యమున్న యంత్రాలున్నాయి. కానీ 10,292 దవాఖానల నుంచి ప్రతిరోజు కేవలం 26,316 కిలోల చెత్త మాత్రమే ఉత్పత్తి అవుతున్నట్లు పీసీబీ చెబుతున్నది. మొత్తం దవాఖానల్లో సగానికి పైగా సూపర్ స్పెషాలిటీ దవాఖానలే ఉన్నట్లు తెలుస్తున్నది. ఒక్కో వైద్యశాలలో సుమారు 50-100 మంది కంటే ఎక్కువ రోగులు చికిత్స పొందుతున్నట్లు అంచనా. ఒక్క గ్రేటర్ హైదరాబాద్లోనే 40 కార్పొరేట్ దవాఖానలు, 150 బస్తీ దవాఖానలు, 90 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.
ఉస్మానియా, గాంధీ, నిమ్స్, ఫీవర్ హాస్పటల్, ప్రసూతి దవాఖానల్లో రోజుకు వందలాది మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వీటిలో ప్రతిరోజూ 500-1000 మంది ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇంత మొత్తంలో వైద్యం అందిస్తుంటే రోజుకు ఒక్కో దవాఖాన నుంచి కేవలం 2.5 కిలోల బయో వ్యర్థాలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నట్లు లెక్కలు కడుతున్నారు. ఇదంతా నామమాత్రంగా చేస్తున్నారా? లేదా దవాఖానలే చెత్తను మున్సిపల్ వాహనాలు, బహిరంగ ప్రదేశాల్లో పారబోస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వైద్య, కాలుష్య నియంత్రణ అధికారుల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం వల్లే దవాఖానలు నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ, కాలుష్య నియంత్రణ మండలిలో నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకమైన టాస్క్ఫోర్స్ విభాగాలు ఉన్నప్పటికీ వారు నామమాత్రంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం రాష్ట్రంలో 10,292 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. వాటన్నింటి నుంచి ప్రతిరోజూ 26,316 కిలోల చెత్త ఉత్పత్తివుతున్నది.
చిన్న చిన్న క్లినిక్ల నుంచి సూపర్ స్పెషాలిటీ దవాఖానల దాకా బయో వ్యర్థాల నిర్వహణ సక్రమంగా చేపట్టడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాలు, మున్సిపల్ డంపింగ్ యార్డుల్లో ప్రత్యక్షమవుతున్న గుట్టలుగుట్టలుగా ఉన్న దవాఖాన వ్యర్థాలను చూస్తుంటే ఆరోపణలను నిజం చేస్తున్నది. ఇష్టానుసారంగా బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పడేయడం వల్ల భూమి, గాలి కాలుష్యం పెరిగిపోతున్నది. సిరంజీలు, రక్తపు నమూనాల అవశేషాల వల్ల డంపింగ్ యార్డుల్లో పనిచేసే వారు వ్యాధుల బారిన పడుతున్నారు. ఇదంతా బాహాటంగానే జరుగుతున్నా..వైద్య, ఆరోగ్య శాఖ, కాలుష్య నియంత్రణ మండలిలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బయో వ్యర్థాల నిర్వహణను పకడ్బందీగా చేపట్టి ప్రజల ఆరోగ్యంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించాలని కోరుతున్నారు.