సిటీబ్యూరో, జూన్ 27(నమస్తే తెలంగాణ): సున్నంచెరువు నీరు ఆరోగ్యానికి హానికరమని, ఈ నీటిని, ఇక్కడి భూగర్భజలాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని పీసీబీ నాణ్యత పరీక్షల్లో తేలినట్లు హైడ్రా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మాదాపూర్‌లోని సున్నం చెరువు దగ్గరలో బోర్లు వేసి ఆ నీటితో వ్యాపారులు ప్రజారోగ్యానికి చేటు తెస్తున్నారని పేర్కొంది. చెరువును పునరుద్ధరించే క్రమంలో హైడ్రా ఇక్కడి భూగర్భ జలాలు ఎంతటి ప్రమాదకరస్థాయిలో ఉన్నాయనే అంశంపై పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు ద్వారా పరీక్షించింది.
తాగునీటిగా సరఫరా చేస్తున్న వాటర్ట్యాంకర్లలోని నీటి నమూనాలపై అధ్యయనం చేసింది సీసం, కాడ్మియం, నికెల్ వంటి లోహాల మోతాదు ఈ నీటిలో అధికంగా ఉన్నాయని, ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని పీసీబీ హెచ్చరించినట్లుగా హైడ్రా తన ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన మోతాదులో కాకుండా రెండింతలు, మూడింతలు, పన్నెండు రెట్లు అధికంగా ఉండి ప్రజల ప్రాణాలను హరిస్తున్నట్లు పీసీబీ పరిశోధనల్లో వెల్లడైనట్లుగా హైడ్రా తెలిపింది.
సహజంగా నీటిని మరగబెట్టి తాగమని అంటారని, కానీ సున్నంచెరువు వద్ద ఉన్న బోర్ల నుంచి వచ్చే నీటిని మరగబెట్టి వాడినా ప్రయోజనం లేదని వైద్యులు చెప్పారని హైడ్రా అధికారులు చెప్పారు.ఈ చెరువు వద్ద బోరు నీటిని తాగునీటి అవసరాలకు అమ్ముతున్న వారిపై పోలీసు కేసులు కూడా పెట్టించామని వారు పేర్కొన్నారు. అయితే సున్నం చెరువును పునరుద్ధరించడమే మొదటి ప్రాధాన్యతగా చూస్తున్నామని, సున్నంచెరువు గుట్టల బేగంపేట, అల్లాపూర్ గ్రామాల మధ్య 32.60 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, ఈ చెరువును కాలుష్యం నుంచి కాపాడి పదికోట్ల నిధులతో మంచినీరు నిలిచే చెరువుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైడ్రా అధికారులు పేర్కొన్నారు.