ఖైరతాబాద్, డిసెంబర్ 14: విద్యుత్, ఇంధనం ఎంతో విలువైనవని, 365 రోజులు వాటిని జాగ్రత్తగా వాడుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ అన్నారు. ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా తెలంగాణ స్టేట్ సెంటర్, ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సంయుక్తాధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను బుధవారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్యభవన్‌లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సునీల్ శర్మ, ఈఈఎస్ఎల్ సేల్స్, సీపీపీఆర్ విభాగాధిపతి అనిమేశ్ మిశ్రా, మాజీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్‌మిశ్రా, ఐఈఐటీఎస్ చైర్మన్ బి.బ్రహ్మారెడ్డి, కార్యదర్శి డాక్టర్ జి. వెంకటసుబ్బయ్య, ఈసీఎం చైర్మన్ ఈ. శ్రీనివాసాచారితో కలిసి ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీల్ శర్మ మాట్లాడుతూ.. ఇంధన పొదుపుపై కేవలం వారం రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తే సరిపోదని, ఏడాదంతా అవగాహన కల్పించాలన్నారు.
విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నదని, ప్రతి ఒక్కరూ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని పొదుపు చేయగలిగితే, దానిని పరోక్షంగా ఉత్పత్తి చేసినట్లవుతుందన్నారు. ప్రజలు వినియోగించే లైట్స్, ఫ్యాన్స్, ఏసీలు, వాషింగ్ మిషన్ తదితర గృహోపకరణాలు 4, 5 స్టార్స్ రేటింగ్‌తో ఉన్నవి కొనుగోలు చేస్తే విద్యుత్తును ఆదా చేసే సామర్థ్యం వాటిలో ఉంటుందన్నారు. ఈసీఎం చైర్మన్ శ్రీనివాసాచారి మాట్లాడుతూ.. ప్రతి ఏడాది డిసెంబర్ 14 నుంచి వారంరోజుల పాటు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తారని, ఈ సారి ఇంధన పొదుపుపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పాఠశాలలు, కళాశాలల్లో క్విజ్, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నామని, 18న నెక్లెస్‌రోడ్‌లో ఇంధన పొదుపు అవగాహన వాక్ ఉంటుందన్నారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా వారోత్సవాల సావనీర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఈఎస్ఎల్ సంస్థ, నిజాం హిందీ మహావిద్యాలయం, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ కలిసి ఏడాది పొడవునా ఇంధన పొదుపుపై వివిధ కార్యక్రమాలను సంయుక్తంగా నిర్వహించేందుకు పరస్పర అంగీకారం కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వారోత్సవాల కోర్ కమిటీ సభ్యులు జీకే ఆనంద్, సుబ్బారాయుడు, సీహెచ్.నర్మదా, జి. కొండల్ రావు, కన్నన్, వి. గోవిందరావు, అమిత్ దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు.
సిటీబ్యూరో, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ): నానాటికి తరిగిపోయే ఇంధన వనరులను సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డా.రామేశ్వర్రావు అన్నారు. గచ్చిబౌలిలోని ఈఎస్సీఐ క్యాంపస్‌లో జరిగిన జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో చీఫ్ లక్ష్మీకాంతరావు, ఎస్పీజీఎస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అంజలిరాయ్, పీఈడీ డాక్టర్ విద్యాసాగర్, శ్రీహరి కృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.