సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : విద్యార్థులకు వేసవి సెలవులు రావడంతో జీహెచ్ఎంసీ అధికారులు పలు సమ్మర్ కోచింగ్ క్యాంపుల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆరు నుంచి 16 ఏండ్ల పిల్లల్లో క్రీడా నైపుణ్యతను పెంపొందించి నిష్టాతులైన క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రతిఏటా తరగతులను నిర్వహిస్తున్నారు. ఔట్‌డోర్, ఇండోర్ స్పోర్ట్స్‌తో పాటు పెయింటింగ్, మనోవికాసాన్ని పెంచే ఫన్నింగ్ గేమ్స్‌లు కలిపి మొత్తం 44 రకాల క్రీడలపై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయగా ఏప్రిల్ 25 నుంచి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మే 31 వరకు సమ్మర్ కోచింగ్ క్యాంపులు-నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీతోపాటు పలు సంస్థలు సైతం నామమాత్రపు ఫీజుతో వేసవి కోర్సుల పేరుతో శిక్షణ ఇస్తున్నాయి. ఇప్పటికే అన్ని జోన్లలో జీహెచ్ఎంసీ అధికారులు క్రీడా పరికరాలను పంపిణీ చేశారు. ఖైరతాబాద్ విక్టోరియా ప్లే గ్రౌండ్లో శిక్షణ కార్యక్రమాలు మంగళవారం ప్రారంభం కాగా, చార్మినార్ జోన్‌లోని కులీ కుతుబ్ షా స్టేడియంలో (నేడు) బుధవారం ప్రారంభం కానున్నాయి. సికింద్రాబాద్ జోన్ మారేడ్‌పల్లి ప్లే గ్రౌండ్లో 27న, కూకట్పల్లి/శేరిలింగంపల్లి జోన్ చందానగర్ పీజేఆర్ స్పోర్ట్స్ స్టేడియంలో 28న, ఎల్బీనగర్ జోన్ పరిధి ఉప్పల్ స్టేడియంలో 29న క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి.
పదవ తరగతి, ఇంటర్ విద్యార్థులకు మే 15 నుంచి 19వ వరకు..
బాస్కెట్‌బాల్, బ్యాట్మింటన్, బాక్సింగ్, క్రికెట్, చెస్, క్యారమ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, కబడ్డీ, రోలర్ స్కేటింగ్, సిపాక్ త్రో, టేబుల్ టెన్నీస్, టెన్నీస్, టెన్నీకోట్, వాలీబాల్ కలిపి మొత్తం 16 రకాల క్రీడా టోర్నమెంట్లను నిర్వహించనున్నారు.
శిల్పారామంలో శిక్షణ..
శిల్పారామంలో వేసవి సెలవుల సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మాదాపూర్ శిల్పారామం పీఆర్వో సుచరిత తెలిపారు. మే 1 నుంచి 19 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు శిల్పారామం మాదాపూర్ క్యాంపస్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మధుబని పెయింటింగ్, యాక్రిలిక్ పెయింటింగ్, నిర్మల్ పెయింటింగ్, చేర్యాల పెయింటింగ్, ట్రైబల్ పెయింటింగ్, పెన్సిల్ స్కెచ్, భగవద్గీత స్లోకాస్ అండ్ సంస్కృత భాషను నేర్పించడం, మట్టితో కుండలు, మట్టి ప్రతిమల తయారీలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు www.shilparamam.in లేదా 88866 52030, 88866 52004 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
స్వరం ఒక వరం పేరుతో..
భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం శిల్పారామం హైదరాబాద్ సురభి కళాక్షేత్రం ఆధ్వర్యంలో ‘స్వరం ఒక వరం’ పేరుతో వాయిస్ అండ్ స్పీచ్ వర్క్‌షాప్‌ను మే 4వ తేదీ నుంచి 21రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు డాక్టర్ సురభి రమేశ్ తెలిపారు. స్టోరీ టెల్లింగ్, పబ్లిక్ స్పీకింగ్ స్టేజ్ యాంకరింగ్, రేడియో ప్రజంటేషన్, పాడ్ కాస్టింగ్, వాయిస్ ఓవర్స్, న్యూస్ రీడింగ్, డబ్బింగ్ టెక్నిక్స్ అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు 94904 23885, 63094 13885 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
భారతీయ సంస్కృతిపై బాలబాలికలకు..
ఆధునికత పేరుతో బాల బాలికలు భారతీయ సంస్కృతిని కోల్పోతున్నారని వారికి ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు కారుణ్య సింధు ఆశ్రమ కార్యదర్శి పుప్పాల వెంకటేశ్వరరావు తెలిపారు. విద్యతో పాటు నైతిక విలువలు, ఆధ్యాత్మిక, దేశ, దైవభక్తి, నీతి, నిజాయితీ, ప్రేమ స్నేహం, తల్లిదండ్రులు, గురువుల పట్ల గౌరవం లాంటి విషయాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. మే 10వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం12.30 గంటల వరకు 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. మరిన్ని వివరాల కోసం 90008 89785, 73862 47393లో కృష్ణానగర్‌కాలనీ, చంపాపేట్, సైదాబాద్‌లో అసక్తి గల వారు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.
తైక్వాండోలో..
హబ్సిగూడలోని సెయింట్ జోసఫ్ పాఠశాలలో ఉదయం 6 నుంచి 7గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6గంటల వరకు అన్ని వయస్సుల బాలికలతోపాటు బాలురకు తైక్వాండో శిక్షణ ఇవ్వనున్నట్లు మాస్టర్ జి.వెంకటేశ్ తెలిపారు. ఆత్మ రక్షణ, బరువు తగ్గడం, ఫిట్నెస్ అంశాల్లో సోమ, బుధ, శుక్ర వారల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
Pp