మల్కాజిగిరి, డిసెంబర్ 17: ప్రజల సౌకర్యం కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసును అల్వాల్‌కు మార్చాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీలోని మంత్రి కార్యాలయంలో బేగంపేట వల్లభ్‌నగర్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని అల్వాల్‌కు మార్చాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
అలాగే నియోజక వర్గంలోని మచ్చ బొల్లారం, మౌలాలి, వినాయక్‌నగర్, గౌతంనగర్ డివిజన్ రూట్లలో బస్సుల సంఖ్యను పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌కు ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. రెండు దశాబ్దాల కింద బేగంపేట వల్లభ్‌నగర్‌లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఏర్పాటు చేశారన్నారు. అల్వాల్‌కు సంబంధించిన అన్ని రిజిస్ట్రేషన్లు ఇక్కడే జరుగుతున్నాయన్నారు.
ప్రజలు అల్వాల్ నుంచి బేగంపేటకు దాదాపు 10కిలో మీటర్లు వెళ్లాల్సి వస్తోందని, దీంతో మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. త్వరలోనే అల్వాల్‌కు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తరలించడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని రూట్లలో బస్సుల సంఖ్యను పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌కు విన్నవించగా.. సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.