సిటీబ్యూరో, జనవరి 12(నమస్తే తెలంగాణ) : హెచ్ఎండీఏ పరిధిలోని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టుపై అధ్యయనం చేసేందుకు కొత్తగా ట్రాన్సాక్షన్ అడ్వయిజరీ(టీఏ)లను నియమించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటీఫికేషన్ జారీ చేయగా, టీఏల ద్వారా బీపీపీ ప్రాజెక్టును అధ్యయనం చేయనున్నట్లు తెలిసింది. హైదరాబాద్ నగరానికి ప్రధాన పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా ఉన్న ట్యాంక్ బండ్ పరిసరాల్లో టీఏల ద్వారా అధ్యయనం చేసి, అందుకు తగినట్లు అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.
కొత్తగా టెండర్లు ఖరారు చేసేందుకు..
రీక్రియేషనల్ జోన్‌గా గుర్తింపు పొందిన బీపీపీ పరిధిలో లుంబీనీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, నెక్లెస్ రోడ్డు, పీపుల్ ప్లాజా, ఎన్టీఆర్ ఘాట్, సంజీవయ్య పార్క్, లేక్ వ్యూ పార్క్, ఏకో పార్క్, లుంబీని లేజర్ షో, పీవీ జ్ఞాన్ భూమి, హుస్సేన్ సాగర్ లేక్, వెట్ ల్యాండ్ ఏకో కన్జర్వేషన్ జోన్ వంటి పర్యాటక ప్రాంతాలు ఉండగా, వీటిని నిత్యం, ముఖ్యంగా వారాంతాల్లో వేలాది మంది సందర్శిస్తుంటారు. ఈ క్రమంలో వీటిపై ఆదాయాన్ని పెంచడం, కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేయడం, నూతన టెండర్లకు అవసరమైన నివేదికలను రూపొందించడం వంటి పనులను చేపట్టేందుకు కొత్తగా టీఏలను నియమించుకునే పనిలో ఉన్నారు. ప్రస్తుతం పలు రకాల టెండర్ ప్రక్రియల ద్వారా ఎంపికైన వారు, సేవలను అందిస్తున్నారు. కొత్తగా టెండర్లు ఖరారు చేసేందుకు ఏజెన్సీలను నియమించుకోనున్నారు. ఈ ఏజెన్సీలన్నీ కలిసి హౌస్ కీపింగ్ నుంచి లైసెన్సుల జారీ వరకు అన్ని నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షించనున్నది.