సుల్తాన్‌బజార్,ఏప్రిల్ 28. మాసబ్‌ట్యాంక్ సైఫాబాద్ సైన్స్ కళాశాల హాస్టల్లో సమస్యలు రాజ్యమేలుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని విద్యార్థులు వాపోతున్నారు. గత నాలుగు నెలలుగా హాస్టల్లో బోర్లో స్థానికంగా ఉన్న బస్తీలోని మురుగు నీరు చేరుతుండటంతో ఇటీవల సుమారు 22 మంది విద్యార్థులు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు.వీరికి ఖైరతాబాద్ ప్రభుత్వ దవాఖానాలో చికిత్సను అందించి డిశ్చార్జీ చేసారు. డిగ్రీ,పీజీ చదువుతున్న సుమారు 300కు పైగా విద్యార్థులు హాస్టల్లో వసతి పొందుతున్నారు.
గత పది రోజులుగా విద్యార్థులు కలుషిత నీరు,పురుగులు పడిన భోజనాన్ని తిని అస్వస్థతకు గురవుతున్నా కళాశాల యాజమాన్యం పట్టించుకున్న పాపాన పోవడం లేదని విద్యార్థులు మండిపడుతున్నారు. హాస్టల్ పాత భవనం వెనుక భాగంలో ఉన్న పవర్ బోర్ ప్రక్కన రెండు సంప్‌లను ఏర్పాటు చేశారు.ఈ సంప్‌లను ఆనుకొని డ్రైనేజీ మురుగు నీటి వ్యవస్థ ఉంది.ఈ మురుగు నీటి ప్రవాహం పవర్బోర్లో కలువడంతో నీరు కలుషితమవుతున్నది.గత కొంత కాలంగా ఈ కలుషితమైన నీటిని వాడుతుండటంతోనే విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై దవాఖానాల పాలయ్యారు.
ఇంత జరుగుతున్నా వార్డెన్లు గానీ,హాస్టల్ వైస్ ప్రిన్సిపాల్, కళాశాల ప్రిన్సిపాల్ పట్టించుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు.దీనికి తోడు సైఫాబాద్ సైన్స్ కళాశాల హాస్టల్ మెస్‌లో వండిన ఆహార పదార్ధాల్లో పురుగులు,దోమలు,ఈగలు ప్రత్యక్షమవడంతో విద్యార్థులు ఆహారాన్ని తిని అస్వస్థతకు గురవుతున్నారు.ఇదిలా ఉండగా ఈ నెల ప్రారంభం నుండి హాస్టల్ వైస్ ప్రిన్సిపాల్,వార్డెన్ల పోస్టులు ఖాళీగా ఉండటంతో ఈ సమస్యలు తీవ్ర రూపం దాల్చి పట్టించుకునే నాథుడే కరువయ్యారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.