ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 3: ఎంతో మంది మేధావులను ప్రపంచానికి అందించిన ఘన చరిత్ర శతాధిక వసంతాల ఉస్మానియా యూనివర్సిటీదని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ శాస్త్ర సాంకేతిక సలహాదారు డాక్టర్ జి. సతీశ్‌రెడ్డి కొనియాడారు. ఓయూ ప్రతిష్టను మరింత పెంపొందించి, ఓయూను ఉన్నత శిఖరాలకు చేర్చాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఓయూ నుంచి పెద్ద సంఖ్యలో స్టార్టప్ సంస్థలు రావాలని కాంక్షించారు. ఆ దిశగా ఓయూ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధనలను ప్రోత్సహించేందుకు నెలకొల్పిన వీసీ అవార్డ్ – 2023 ఫర్ రీసెర్చ్ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సతీశ్‌రెడ్డి హాజరై మాట్లాడారు. గతంలో చదువుకున్న ప్రతి ఒక్కరూ తమ చదువుతో సంబంధం లేకుండా ఐటీ రంగంవైపు పరిగెత్తేవారని గుర్తు చేశారు. ఇది గత కొంత కాలంగా మారిందన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో వినూత్న మార్పులు వచ్చాయని చెప్పారు. దాంతో కేవలం రక్షణ రంగంలోనే వేల కోట్ల రూపాయల ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి మన దేశం చేరుకుందని వివరించారు.
స్టార్టప్‌లను ప్రోత్సహించాలి..
మన దేశంలో 2017లో 461 స్టార్టప్‌లు ప్రారంభం కాగా, ఆ సంఖ్య 2022 నాటికి 75 వేలకు చేరుకుందని గణాంకాలు చెబుతున్నాయన్నారు. ఇది శుభపరిణామమన్నారు. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ఓయూలో ఒక కేంద్రం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కోర్ రీసెర్చ్‌వైపు పరిశోధకులు దృష్టిసారించాలన్నారు. గత 35 ఏళ్లుగా ఓయూతో తనకు అనుబంధముందని గుర్తు చేసుకున్నారు. ఓయూ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం డాక్టర్ మురళీధర్‌రెడ్డి, ప్రొఫెసర్ రామకృష్ణ, ప్రొఫెసర్ శశికాంత్, డాక్టర్ అశోక్‌కుమార్, డాక్టర్ జ్యోతి, డాక్టర్ సుధాకర్‌బాబుకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీసీ ప్రొఫెసర్ బి. జగదీశ్వర్‌రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, యూజీసీ డీన్ ప్రొఫెసర్ మల్లేశం, ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్యానాయక్, అండర్సన్ క్యాన్సర్ సెంటర్ ఎండీ ప్రొఫెసర్ రఘు కల్లూరి పాల్గొన్నారు.