Little Flower High School | ఉప్పల్, ఆగస్టు 2 : రెండో తరగతి చదువుతున్న చిన్నారిపై ఓ విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించాడు. ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి విషయం చెప్పారు. దీంతో ఇరువురు పేరెంట్స్‌తో స్కూల్ యాజమాన్యం చర్చించినట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా, తల్లిదండ్రులతో మాట్లాడి పంపించివేసిన విషయం తెలియడంతో ఇతర విద్యార్థుల పేరెంట్స్, వివిధ విద్యార్థి సంఘాల నేతలు శుక్రవారం పెద్దసంఖ్యలో పాఠశాలకు చేరుకొని నిరసన తెలిపారు. స్కూల్ ఎదుట ధర్నా చేసిన విద్యార్థి సంఘాల నేతలు..యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.
చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని, లక్షల్లో ఫీజులు వసూలు చేసే పాఠశాల యాజమాన్యం.. విద్యార్థుల భద్రతపై దృష్టిపెట్టడం లేదని ఆరోపించారు. విద్యార్థి సంఘాల నేతలు పాఠశాలలోకి దూసుకొచ్చేందుకు యత్నించడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ జోసెఫ్‌ను వివరణ కోరగా, ఘటనపై విచారణ చేపట్టి, అసభ్యంగా ప్రవర్తించిన విద్యార్థికి టీసీ ఇచ్చి, పంపించి వేశామని స్పష్టం చేశారు.