దుండిగల్, డిసెంబర్ 2 : ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ కళాశాలకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం… నిజామాబాద్ జిల్లా, మోపాల్ మండలం, చిన్నతాడెం గ్రామానికి చెందిన కుంచన్‌పల్లి రఘురాంరెడ్డి, విద్యారెడ్డి దంపతుల కూతురు కుంచన్‌పల్లి ప్రగ్నారెడ్డి(17) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, ప్రగతినగర్, ఎన్ఆర్ఐ కాలనీలో ఉన్న ‘ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల’లో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతుంది.
ఈ క్రమంలో సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ప్రగ్నారెడ్డి తనకు వ్యక్తిగత సమస్య ఉందంటూ తరగతి గదినుంచి హాస్టల్లోని గదికి వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత హాస్టల్ ఇన్చార్జి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. దీంతో కళాశాల యాజమాన్యం సమీపంలోని ఓప్రైవేట్ వైద్యశాలకు తీసుకువెళ్లగా అప్పటికే ప్రగ్నారెడ్డి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా.. తమ కూతురుపై చదువు విషయంలో కళాశాల యాజమాన్యం తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడంతోనే ఇంతటి దారుణానికి పాల్పడిందని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రగ్నారెడ్డి ఆత్మహత్య విషయం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాల నేతలు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అయినప్పటికీ కళాశాల యాజమాన్యం తమకు సంబంధంలేనట్లు వ్యవహరించడంతో ఆగ్రహించిన విద్యార్థి సంఘాలు కళాశాలలోని కుర్చీలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థి సంఘాల నేతలను శాంతింజేశారు.
ఈ ఏడాది ఆగష్టు 1న దుండిగల్‌లోని నిర్మాణంలో ఉన్న కళాశాల హాస్టల్గదిలోనే మొదటి సంవత్సరం చదువుతున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖిల్(17) అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడగా, సోమవారం అదే జిల్లాకు చెందిన ప్రగ్నారెడ్డి సైతం బలవన్మరణం చెందడం విషాదకరం. అయినప్పటికీ ఇంటర్మీడియట్ ఎడ్యూకేషన్ అధికారులు స్పందించక పోవడం అనుమానాలకు తావిస్తున్నదని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ విద్యాసంస్థలపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.