Hyderabad | చిక్కడపల్లి, మార్చి 25: హైదరాబాద్ గాంధీనగర్ డివిజన్లో గత 15 రోజులుగా స్ట్రీట్ లైట్లు వెలగడం లేదు. విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో జవహర్నగర్ గీతాంజలి హైస్కూల్ లైన్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై సంబంధిత అధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రిపూట వీధి దీపాలు లేకపోవడంతో మహిళలు బయటకు వెళ్లాలంటే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని స్థానికులు తెలిపారు. వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. చీకటి కారణంగా పలు యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని.. మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. గత ప్రభుత్వంలో ఫిర్యాదు ఇచ్చిన ఒకటి రెండు రోజుల్లోనే మరమ్మతులు జరిగేవని స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఎస్టీ ప్రేమ్ తెలిపారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సదరు అధికారులను నిలదీయగా.. మరమ్మతులకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉండటం వల్లే ఈ పనులు చేయలేకపోతున్నామని వివరిస్తున్నారని చెప్పారు.