HomeHyderabadStree Summit 2 0 Concludes In Hyderabad
మహిళల భద్రతే ముఖ్యం..
తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత, మహిళా సాధికారతే లక్ష్యంగా హైదరాబాద్ సిటీపోలీస్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్(హెచ్సీఎస్సీ) సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం స్త్రీసమ్మిట్-2.0 ఘనంగా జరిగింది.
ఘనంగా స్త్రీ సమ్మిట్ 2.0
సిటీబ్యూరో, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత, మహిళా సాధికారతే లక్ష్యంగా హైదరాబాద్ సిటీపోలీస్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్(హెచ్సీఎస్సీ) సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం స్త్రీసమ్మిట్-2.0 ఘనంగా జరిగింది. తాజ్‌డెక్కన్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, సిటీపోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల అభివృద్ధే తమ లక్ష్యమన్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్, హెచ్సీఎస్సీ చైర్మన్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. దేశంలో బాలికల నిష్పత్తి తగ్గుతున్నదని, ఇది దేశప్రగతికి కొంత అవరోధంగా మారుతుందన్నారు. ప్రతీ ఇంట్లో, పనిచేసేచోట మహిళలపై వివక్షత పోవాలని పిలుపునిచ్చారు. నీతిఅయోగ్ లా డివిజన్ సీనియర్ స్పెషలిస్ట్ డా.భానుశ్రీవేల్పాండ్యన్ మాట్లాడుతూ.. మహిళా సాధికారత కోసం నీతిఆయోగ్ తన విభాగాలతో పాటు ఇతర శాఖలను కూడా ప్రభావితం చేస్తున్నదన్నారు.
ఈ సదస్సులో 5 సెషన్లలో మహిళల భద్రత, చిన్నపిల్లల రక్షణ, సైబర్ సెక్యూరిటీ, అర్బన్ ఎన్విరాన్మెంట్, ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్ వంటి అంశాలపై చర్చ జరిగింది. విభిన్నరంగాలకు చెందిన మహిళలు, యువతులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సమ్మిట్‌లో భాగంగా విమెన్ సేఫ్టీవింగ్ డీసీపీ డా.లావణ్య చిన్నారులపై లైంగిక వేధింపులు తదితర వివరాలను తెలిపేలా ప్రజెంటేషన్ ఇచ్చారు.
సెషన్ల సంయోజకులుగా నీహారిక మాల్పూర్, ఉమాసుధీర్, చేతనాజైన్, పూర్ణిమాకాంబ్లే, ఖ్యాతినిర్వాణె,గీతాగోటి, చారు వాలిఖన్నాలు వ్యవహరించారు. కార్యక్రమంలో ఐఏఎస్ అధికారులు దివ్యదేవరాజన్, వనిత దాట్ల, జెన్నిఫర్ లార్సన్, నిర్మలాకాంతి వెస్లీ, జాయింట్ సీపీ పరిమళహననూతన్, హెచ్సీఎస్సీ జనరల్ సెక్రటరీ సి.శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.