సిటీబ్యూరో, జూన్ 6(నమస్తే తెలంగాణ): గోవా నుంచి సికింద్రాబాద్ వస్తున్న వాస్కోడీగామ రైలులో ఆబ్కారీ ఎస్టీఎఫ్ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో 1.5లక్షల విలువజేసే 48నాన్ డ్యూటీ పెయిడ్ లికర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే… గోవా నుంచి పెద్దఎత్తున నగరానికి నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం సరఫరా జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్, డీటీఎఫ్ బృందాలు శుక్రవారం గోవా నుంచి సికింద్రాబాద్ వస్తున్న వాస్కోడీగామ రైలును షాద్నగర్ నుంచి కాచిగూడ వరకు తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో రూ.1.5లక్షల విలువజేసే 48 మద్యం బాటిళ్లు లభించినట్లు అధికారులు వెల్లడించారు. ఆబ్కారీ ఈడీ షానవాజ్ ఖాసీం ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ దాడుల్లో ఎస్టీఎఫ్ సీఐలు భిక్ష్మా రెడ్డి, వెంకటేశ్వర్లు, నాగరాజులతోపాటు సికింద్రాబాద్ డీటీఎఫ్ సీఐతోపాటు మొత్తం 35 మంది సిబ్బంది పాల్గొన్నారు.