పీర్జాదిగూడ, ఏప్రిల్ 11: ఆస్తిని కాజేయాలని దుర్బుద్ధితో సవతి తల్లి పలువురితో కలిసి కూతురిని అమానుషంగా హత్య చేసి వాగులో పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బోడుప్పల్ లక్ష్మీనగర్ కాలనీలో నివాసముంటున్న జాకోతు పీనా ఉస్మానియా యూనివర్సిటీలో లైబ్రరీ ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు. తన కూతురు మహేశ్వరి 26 నిమ్స్ లో కాంటాక్ట్ బేసిక్ లో స్టాఫ్ నర్స్ గా పని చేస్తున్నది.
పీనా మొదటి భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో లలితను మరో వివాహం చేసుకున్నాడు. వీరికి కూతురు ఉన్నది. మొదటి భార్య కూతురైన మహేశ్వరికి వివాహం జరిగిన తర్వాత కొన్నాళ్లకు వివిధ కారణాలతో విడాకులయ్యాయి. అయితే పీనా తన కూతురికి మళ్లీ వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. స్థానికంగా ఉన్న రెండు ఇండ్లలో ఒకటి కూతురికి ఇచ్చి పెండ్లి చెయ్యాలని అనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పినతల్లి లలిత తన కూతురికే ఆ రెండు ఇండ్లు ఉండాలనే దుర్బుద్ధితో మహేశ్వరిని అంతం చేయాలని పథకం పండింది.
ఇందులో భాగంగా లలిత మేనబావైన సీఆర్పీఎఫ్లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న రవికి విషయం తెలిపింది. దీంతో కానిస్టేబుల్ తో కలిసి గత డిసెంబర్ 7వ తేదీన మహేశ్వరి ఇంటికి వచ్చారు. పీనా ఉద్యోగరీత్యా వెళ్లిన సమయాన్ని చూసి లలితతో కలిసి ఒంటరిగా ఉన్న మహేశ్వరి మేడకు వైరుతోపాటు చున్నీని బిగించి హత్య చేశారు. వెంటనే లలిత మేనబావైన రవి స్వగ్రామం సూర్యాపేట జిల్లా శాలిగౌరారం గ్రామానికి మహేశ్వరి శవాన్ని తీసుకెళ్లి మూసి సమీపంలో పూడ్చిపెట్టారు. అదే రోజు మహేశ్వరి తండ్రి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో తన కూతురు అదృశ్యమైనట్టు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు సుమారు నాలుగు నెలల తర్వాత కేసులు ఛేదించారు. నిందితులను శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకొని తీసుకొని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.