నేరేడ్మెట్, మే 5: సిలిండర్లలో కొంత గ్యాస్‌ను తస్కరించి.. నీళ్లు నింపి.. .వినియోగదారులకు సరఫరా చేస్తున్న ముగ్గురు డెలివరీ బాయ్స్‌ను పోలీసులు అరెస్టు చేసి..రిమాండ్‌కు తరలించారు. మల్కాజిగిరి డీసీపీ రక్షిత కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. మౌలాలిలోని లక్ష్మీ వైష్ణవి ఎంటర్ప్రైజెస్ హెచ్‌పీ గ్యాస్ కంపెనీకి కొన్ని రోజులుగా సిలిండర్ తొందరగా అయిపోతున్నదని.. స్టౌవ్ వెలగటం లేదని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో కంపెనీలో పనిచేస్తున్న ముగ్గురిపై అనుమానం ఉన్నట్లు మేనేజర్ బుర్ర మహేశ్ గౌడ్ జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు డెలివరీ బాయ్స్ కొర్రిపల్లి దయాకర్ (47), పొనగంటి ప్రవీణ్ (34), చింతల బాబు (27)లను అదుపులోకి తీసుకొని.. విచారించగా, అక్రమ రీ ఫిల్లింగ్ వ్యవహారం బయటపడింది. వినియోగదారులకు సరఫరా చేసే సిలిండర్ నుంచి కొంత గ్యాస్‌ను తీసుకొని.. వేరే సిలిండర్లలో నింపి.. అవసరమున్న వారికి అమ్ముకుంటున్నట్లు తేలింది. కస్టమర్లకు మాత్రం తొలగించిన కొంత గ్యాస్స్థానంలో నీళ్లు నింపి డెలివరీ చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి 11 నిండుగా ఉన్న సిలిండర్లు, 1 ఖాళీది, వస్తువులు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు.