సిటీబ్యూరో, డిసెంబరు 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ అధికారుల కేంద్ర సంఘం ఏర్పడింది. 1982లో పురుడుపోసుకున్న ఈ సంఘం అప్పట్లో ఆంధ్రా అధికారుల గుప్పిట్లో ఉండటంతో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఆబ్కారీ అధికారులు ఆ సంఘం నుంచి బయటకు వచ్చేసి, ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పటి నుంచి ఆబ్కారీ శాఖలోని సీఐలు, ఎస్ఐలకు ఎలాంటి సంఘం లేకుండా పోయింది.
అయితే శాఖా పరంగాగాని, సంక్షేమ పరంగా కాని ఏవైన సమస్యలు, ఇతరాత్ర అంశాలను ఉన్నతాధికారులు, ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లేందుకు వారధిగా పనిచేసే ఒక సంఘం ఉండాలని భావించిన అధికారులు ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ అధికారుల కేంద్ర సంఘం ( టీజీపీఈఈఓసీఏ) ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖలోని 762 మంది సీఐలు, ఎస్ఐల సభ్యత్వంతో నూతనంగా తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ అధికారుల కేంద్ర సంఘం ఏర్పడింది.
ఈ సంఘానికి బుధవారం హైదరాబాద్లోని రైల్వే ఆఫీసర్స్ క్లబ్లో జరిగిన ఎన్నికల్లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చంపేట ఎక్సైజ్ స్టేషన్ ఎస్హెచ్ఓ సూర కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎస్ఐ కె.చిరంజీవి, కోశాధికారిగా డి.భాసర్రావులు ఎన్నికయ్యారు. వీరితోపాటు ముగ్గురు అసోసియేట్ అధ్యక్షులు, ముగ్గురు ఉపాధ్యక్షులు, ముగ్గురు సంయుక్త కార్యదర్శలు, ఇద్దరు జోనల్ కార్యదర్శలు, అరుగురు సభ్యులుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సూర కృష్ణయ్య మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖలో పనిచేసే సీఐలు, ఎస్ఐల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామన్నారు.
ప్రధానంగా ప్రతి రెండేండ్లకు ఒకసారి సీఐలు, ఎస్ఐల సాధారణ బదిలీలు జరిగే విధంగా, సకాలంలో పదోన్నతులు కల్పించే విధంగా తమవంతు కృషి చేస్తామన్నారు. సీఐ, ఎస్ఐల మధ్య కెపాసిటి బిల్డింగ్, ఇంటిగ్రిటి తదితర అంశాలకు సంబంధించి కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఎగ్జిక్యూటివ్ అధికారుల సంక్షేమంతో పాటు ఎక్సైజ్ శాఖ బలోపేతానికి కూడా కృషి చేస్తామన్నారు. అనంతరం సంఘం నూతన కార్యవర్గ సభ్యులతోపాటు పలువురు సీఐలు, ఎస్ఐలు ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెకట్రరీ రఘునందన్ రావు, ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్, అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషిలను మర్యాద పూర్వకంగా కలిశారు.